రెండేళ్ల క్రితం ‘ప్రేమలు’ విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని ప్రతిబింబించే బాడీ లాంగ్వేజ్ యువతను బాగా ఆకట్టుకున్నాయి. మలయాళంలోనే కాదు తెలుగులోనూ ప్రేమలు పెద్ద హిట్టయి తనకు మంచి క్రెడిట్ ఇచ్చింది. సరిగ్గా ఫోకస్ పెడితే అగ్ర హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ కోలీవుడ్ పత్రికలు హోరెత్తించాయి. అయితే మమిత అడుగులు తడబడుతున్నాయని చెప్పాలి.
తాజాగా విడుదలైన ‘కర’లో ధనుష్ భార్యగా ఏ మాత్రం ప్రాధాన్యం లేని పాత్ర పోషించింది. సినిమా ప్రారంభంలో ఓ రెండు నిమిషాల ఎమోషనల్ సీన్ తర్వాత తను మళ్ళీ ఎక్కడా కనిపించదు. సెకండాఫ్ లో స్క్రీన్ స్పేస్ కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. ఇంత తక్కువ నిడివి వల్ల సాధించిందేమిటో అర్థం కాదు. రిలీజ్ కోసం సర్కస్ చేస్తున్న ‘జన నాయకుడు’లోనూ ఆమె హీరోయిన్ కాదు. భగవంత్ కేసరిలో శ్రీలీల క్యారెక్టర్ తమిళంలో మమిత బైజు చేసింది. అంతే.
‘డ్యూడ్’ సక్సెస్ అయినా దాని క్రెడిట్ అధిక శాతం ప్రదీప్ రంగనాథన్ కు వెళ్ళిపోయింది. త్వరలో విడుదల కాబోయే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ లో నలభై ఏళ్ళ వ్యక్తిని ప్రేమించే ఇరవై సంవత్సరాల అమ్మాయిగా పెద్ద రిస్క్ చేస్తోంది. సూర్య సరసన రెగ్యులర్ జోడిగా అయినా పర్వాలేదు కానీ క్యారెక్టర్ పరంగా మరీ ఇంత ఏజ్ గ్యాప్ ఉన్న రోల్ చేయడం రేపు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ప్రేమలు తర్వాత వెంటనే చేసిన ‘కామ్రేడ్’ కూడా మమితకు డిజాస్టరే ఇచ్చింది.
ప్రస్తుతం మమిత బైజు తమిళంలో ఇరండు వానం, మలయాళంలో బెత్లెహమ్ కుటుంబ యూనిట్ చేస్తోంది. ఇవి కాకుండా కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. తెలుగులో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కథలు నచ్చక సున్నితంగా నో చెప్పేసింది. అంతా బాగానే ఉంది కానీ తమిళ తెలుగులో స్టార్ హీరోయిన్లు తగ్గిపోతున్న గ్యాప్ ని వాడుకునే దిశగా మమిత బైజు అడుగులు పడటం లేదు. విశ్వనాథ్ అండ్ సన్స్ మీద గంపెడు ఆశలు పెట్టుకుంది కానీ అది ఎలాంటి ఫలితంఇస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates