ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రాష్ట్రంలో దాదాపు అన్ని మునిసిపాలిటీలను కూటమి ప్రభుత్వం కైవసం చేసుకునే దిశగా అడుగులు వేసింది. ఇప్పటికే చాలా వరకు స్థానిక సంస్థలు కూటమి పరం అయ్యాయి. కీలకమైన తిరుపతిని కూడా హస్తగతం చేసుకున్న కూటమి.. చీరాల, విశాఖ, కదిరి, తిరువూరు, గుంటూరు వంటి చోట్ల కూడా.. పాగా వేస్తోంది. ఇప్పటికే కొన్ని సొంతం చేసుకుంది. ఇక, విజయవాడలో మాత్రం కదలిక కొంత తగ్గింది.
కూటమి నాయకుల మధ్య కలివిడి లేకపోవడం.. కీలకమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ నాయకుడు ఉన్న నేపథ్యంలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌ను దక్కించుకునే విషయంలో కూట మి నాయకులు ఇంకా దృష్టి పెట్టలేదు. కానీ, బలంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గంలో మాత్రం కూటమి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. స్థానికంలో జెండా ఎగరేస్తున్నారు. విజయవాడపై కూడా.. దృష్టి పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని సీనియర్లు చెబుతున్నారు.
మరోవైపు.. విశాఖపట్నం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్‌ను కూడా ఇటీవల దక్కించుకున్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయం మాత్రమే వాయిదా పడింది. ఇది మినహా మిగిలిన చోట్ల మాత్రం కూటమి దాదాపు దున్నేసిందనే చెబుతున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ మరింత కుదేలయ్యే పరిస్థితి వచ్చింది. స్థానికంగా పట్టు కోల్పోతే.. వైసీపీ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ముందుకు తీసుకువెళ్లే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే.. దీనిపై జగన్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు.
ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని.. ఇప్పుడు పదవులు కోల్పోయిన వారు పార్టీ కోసం పనిచేస్తారని ఆయన ఊహాగానాల్లో ఉన్నారు. కానీ, మార్కాపురం వంటి మునిసిపాలిటీల్లో పార్టీ తనను పట్టించుకోవడం లేదని భావించిన చైర్మన్ చంద్ర ఏకంగా పార్టీ మారారు. త్వరలోనే ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. ఎలా చూసుకున్నా.. వైసీపీ అనుసరిస్తున్న వైఖరి మాత్రం పార్టీని మరింత దిగజారేలా చేస్తోందని అంటున్నారు.