రైత‌న్న‌కు అండ‌గా.. ఆ పేరు తుడిచేస్తున్న చంద్ర‌బాబు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గ‌తంలో ఎప్పుడో..ఎక్క‌డో.. వ్య‌వ‌సాయం దండ‌గ‌ అన్నారంటూ.. ప్ర‌తిప‌క్ష వైసీపీ నాయ‌కులు త‌ర‌చుగా వ్యాఖ్యానిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల‌కు చంద్ర‌బాబు చేసిందేమీ లేద‌ని కూడా చెబుతూ వ‌చ్చారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వం మాత్ర‌మే రైతుల‌ను క‌డుపులో పెట్టుకుని చూసుకుంద‌ని.. చంద్ర‌బాబు వ్య‌వ‌సాయం దండ‌గ అంటూ.. రైతులను విస్మ‌రించి ఐటీని త‌ల‌కెత్తుకున్నారంటూ.. క‌మ్యూనిస్టులు కూడా గ‌తంలో వ్యాఖ్యానించారు. విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియ‌దు కానీ.. చంద్ర‌బాబు పాల‌న‌లో రైతుల‌కు మేలు జ‌రిగిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి.

అన్న‌దాత సుఖీభ‌వ‌.. అంటూ 2014-17 మ‌ధ్య రైతుల‌కు ఇన్‌పుట్ స‌బ్సిడీ ఇచ్చే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. రైతుల నుంచి తీసుకునే భూముల‌ను కూడా సేక‌ర‌ణ కాకుండా స‌మీక‌రించే విధానానికి శ్రీకారం చుట్ట‌డం ద్వారా.. వారికి మ‌రింత మేలు చేసే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఇక‌, తాజాగా రైత‌న్న‌ల వ్య‌వ‌హారంలో మ‌రిన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. తాజాగా మంగ‌ళ‌వారం జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో రైతుల స‌మ‌స్య‌ల‌పై సుదీర్ఘ స‌మ‌యం చ‌ర్చించారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అండ‌గా నిల‌వాల్సిందేన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ముఖ్యంగా గ‌త నెల వివాదంగా మారిన ఎండు మిర్చి, పొగాకు కొనుగోళ్ళ విష‌యంలో స‌ర్కారే నేరుగా జోక్యం చేసుకుని రైతుల‌కు మేలు చేయాల‌ని అన్నారు.

అదేవిధంగా ఈ ఏడాది పంట‌ల దిగుబ‌డులు పెరిగినందున అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప‌రిస్థితుల‌ను చంద్ర‌బాబు తెలుసుకున్నారు. యుద్ధాలు, ప్ర‌భుత్వాల మార్పు కార‌ణంగా ఎగుమ‌తి చేసే వాటికి ధ‌ర‌లు త‌గ్గాయ‌ని తెలుసుకున్న ఆయ‌న ఎండు మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరకు, మామిడి వంటి పంట ఉత్పత్తులకు రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే మ‌ద్ద‌తు ధ‌ర‌లు ఇచ్చేలా చూడాల‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యంలో కేంద్రంతో స‌మ‌న్వ‌యం చేసుకుని రైతులు న‌ష్ట‌పోకుండా కూడా చూసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

మంత్రుల‌తో క‌మిటీ..

రాష్ట్రంలో ఉత్ప‌త్తి అయ్యే పంట‌ల‌ను దృష్టిలో పెట్టుకుని వాటికి గిట్టుబాటు ధరలు పెరిగేలా, నిత్యావసరాల ధరలు అదుపులో ఉండేలా.. ఆరుగురు మంత్రులతో కూడిన క‌మిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉత్ప‌త్తుల‌కు గిట్టుబాటు ధర దక్కేందుకు అనుస‌రించాల్సిన చర్యలపై ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అలాగే పొగాకును అవ‌స‌ర‌మైతే.. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే సేక‌రించేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌న్నారు. రైతు బ‌జార్ల‌ను బ‌లోపేతం చేసి కూర‌గాయ‌ల రైతుల‌కు మేలు చేయాల‌ని సూచించారు. ఇలా.. అన్న‌దాత‌ల స‌మ‌స్య‌ పై చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా సుదీర్ఘ స‌మ‌యం కేటాయించ‌డంతో రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.