వెండితెర పై పవన్.. ప్రజల కోసం

సినిమాల్లో పవన్ కల్యాణ్ ది ఓ డిఫరెంట్ స్టైల్. ఆ స్టైలే ఆయనను పవర్ స్టార్ గా నిలబెట్టింది. లక్షలాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. సినిమాల మాదిరే ఇప్పుడు రాజకీయాల్లోనూ పవన్ తనదైన శైలి డిఫరెంట్ స్టైల్ లో దూసుకుపోతున్నారు. టీడీపీ, బీజేపీలతో జనసేనను కలిపి కూటమి కట్టి వైసీపీని గద్దె దించే వ్యూహాన్ని పక్కాగా అమలు చేసిన పవన్… జనసేనకు వంద శాతం విజయాలను అందించారు. ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. పల్లెలంటే తనకెంత ఇష్టమో చెప్పడమే కాకుండా పల్లె ప్రగతికి సంబందించిన శాఖలను తీసుకున్న పవన్… పల్లె ప్రగతికి తనదైన శైలి నూతన పద్ధతులతో పట్టం కడుతున్నారు. అందులో బాగంగానే ఇప్పుడు పవన్ మన ఊరు మాటా మంతి పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.

గురువారం (ఈ నెల 22 నుంచి) నుంచి అమలు కానున్న ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచే ఎంపిక చేసిన గ్రామాల ప్రజలతో మాట్లాడతారు. వారి సమస్యలను వింటారు. వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా అదికారులకు దిశానిర్దేశం చేస్తారు. అంటే… మన నేతలు పల్లెలకు వెళ్లి అక్కడ రచ్చబండ అనో, ప్రజల వద్దకు పాలన అనో పేర్లు పెట్టేసి సమస్యల పరిష్కారం కోసం వేసే టూర్లను పవన్ ఎక్కడికీ కదలకుండానే… తానున్న చోటు నుంచే ఎంపిక చేసిన గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరంచడం అన్నమాట. ఇందుకు ఆయా ప్రాంతాల్లోని సినిమా థియేటర్ స్క్రీన్లను వినియోగించుకుంటారు. థియేటర్ స్క్రీన్ ఎదుట ప్రజలు కూర్చుంటే… మంగళగిరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్ ముందు పవన్ కూర్చుని వారితో నేరుగా ముచ్చటిస్తారు. అంటే… వెండితెర వేదికగా రచ్చబండ అన్నమాట.

సరే… కార్యక్రమం ఏదైనా ప్రజా సమస్యల పరిష్కారమే అంతిమ లక్ష్యంగా పవన్ సాగుతున్నారు కదా. అయితే ఈ వెండితెర గ్రీవెన్స్ మాత్రం వాటన్నింటిలోనూ ప్రత్యేకమని చెప్పాలి. తనకున్న వెండితెర అనుభవాన్ని ప్రజలకు కూడా అనుభవం కలిగేలా పవన్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లుగా అనిపిస్తున్నా…పవన్ లక్ష్యం వేరని తెలుస్తోంది. గ్రీవెన్స్ కోసం తాను వెళ్లడం, లేదంటే ప్రజలు తన వద్దకు రావడం… రెండూ వ్యయ ప్రయాసలతో కూడుకున్నవే. అదే ఇలా వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో గ్రీవెన్స్ చేపడితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనతో ఈ వెండితెర గ్రీవెన్స్ రూపుదిద్దుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి పరిదిలోని రావివలస గ్రామస్తులతో పవన్ సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పవన్ జాయిన్ అయితే,.. రావివలస గ్రామానికి చెందిన 300 మంది టెక్కలిలోని భవాని థియేటర్ ద్వారా పవన్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పవన్ రావివలస గ్రామస్తులతో చర్చిస్తారు. వారి సమస్యలపై ఆరా తీస్తారు. ఆ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తారు. ఈ దిశగా ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి ఈ వెండి తెర గ్రీవెన్ష్ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే.. గురువారం దాకా ఆగాల్సిందే మరి.