దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు మధ్య వివాదం ఏర్పడింది. తొలిసారి.. సుప్రీంకోర్టులో రాష్ట్రపతి పిటిషన్ దాఖలు చేయడంతోపాటు.. సూటిగా కొన్ని ప్రశ్నలు సైతం సంధించారు. ‘రాజ్యాంగం ప్రకారం ఎవరిది ఏస్థాయి?’ అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు. రాజ్యాంగం ప్రకారం.. సుప్రీంకోర్టు.. రాష్ట్రపతికి లక్ష్మణ రేఖలు గీయగలదా? అనేది మరో కీలక ప్రశ్న. ఇలా.. మొత్తం 14 ప్రశ్నలతో కూడిన పిటిషన్ను రాష్ట్రపతి ముర్ము తాజాగా దాఖలు చేశారు.
ఏం జరిగింది?
కొన్నాళ్లుగా.. తమిళనాడు గవర్నర్ ఎన్. రవికి.. అక్కడి స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలంగా బిల్లులను తొక్కిపెట్టి ప్రభుత్వ పాలనకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని పేర్కొంటూ.. స్టాలిన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో విచారణ జరిగిన సుప్రీంకోర్టు రాష్ట్రపతి, గవర్నర్‌కు కూడా.. కొన్ని నిర్దేశాలు చేసింది. మూడు మాసాల్లోనే బిల్లులను అనుమతించాలని.. లేనిపక్షంలో న్యాయసలహా తీసుకోవాలని పేర్కొంది. ఇది కూడా మూడు మాసాల్లోనే పూర్తి కావాలని పేర్కొంది.
ప్రజాస్వామ్యాన్ని.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవరూ నిర్దేశించజాలరని పేర్కొంది. అయితే.. దీనిలో రాష్ట్రపతి ప్రస్తావన తీసుకురావడం.. అప్పట్లోనే న్యాయ చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు.. త్రివిధ దళాలకు అధిపతి, రాజ్యాంగానికి ప్రతినిధిగా వ్యవహరించే రాష్ట్రపతికి లక్ష్మణ రేఖలు గీయతగునా? అంటూ.. పెద్దలు చర్చించారు. ఒకానొక సందర్భంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సైతం.. ఇదే వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది.
తాజాగా ఈ వ్యవహారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా ఒక రాష్ట్రపతి సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ‘రాజ్యాంగంలో అలాంటి నిబంధనేది లేనప్పుడు ఈ తీర్పు ఎలా ఇవ్వగలర’ని రాష్ట్రపతి ప్రశ్నించారు. ఏప్రిల్ లో ఇచ్చిన 415 పేజీల తీర్పును సమీక్షించాలని కోరారు. నిజానికి ఇది సంచలనమేనని చెప్పాలి. దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.