టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్‌కు.. ప్రమోషన్ ఇస్తున్నారా? ఆయనకు మహానాడు వేదికగా కీలక పార్టీ పదవిని కట్టబెట్టనున్నారా? ఇదీ.. ఇప్పుడు ఏ ఇద్దరు టీడీపీ నాయకులు కలుసుకున్నా జరుగుతున్న చర్చ. అంతేకాదు.. ప్రత్యేకంగా ఫోన్లు చేసి మరీ నాయకులు దీనిపైనే చర్చిస్తున్నారు. మరి ఏం జరిగింది? దీని వెనుక జరుగుతున్న చర్చకు కారణమేంటి? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ నెల 27 నుంచి 29 వరకు మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి మహానాడు కావడం.. చంద్రబాబుకు 75 వసంతా లు పూర్తయ్యాక నిర్వహిస్తున్న మహానాడు కావడంతో దీనికి అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు.. తొలిసారి తమ ప్రత్యర్థి జగన్ ఇలాకాలో మహానాడును నిర్వహించడం కూడామరింత ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు యువగళం పాదయాత్ర ద్వారా తన శక్తిని ధారపోసిన నారా లోకేష్ వ్యవహారం కూడా చర్చనీయాంశం అయింది.
పార్టీలో ప్రస్తుతం నారా లోకేష్.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అయితే.. సమీప భవిష్యత్తులో పార్టీలో యువరక్తాన్ని మరింత పెంచాలన్నది పార్టీ వ్యూహాత్మక నిర్ణయం.. వచ్చేదంతా .. యువ నాయకత్వమేనని చెబుతున్నారు. ఇక, కొన్నాళ్లుగా నారా లోకేష్ కు కీలక పదవిని ఇవ్వాలన్న చర్చ కూడా నడుస్తోంది. దీనిపై ఎప్పటికప్పుడు చంద్రబాబు దాట వేత ధోరణినే అవలంబిస్తున్నారు. అయితే.. ఇప్పుడు సమయం ఆసన్నమైందని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబుకు 79 సంవత్సరాలు వస్తాయి.(వయసు ఎవరికైనా ఆగదు కదా!). సో.. అప్పటికి పార్టీలో మరింత ఉత్తేజంగా వ్యవహరించే నాయకుడు… అవసరం ఉంది. సో.. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కు నేరుగా జాతీయ అధ్యక్షుడి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఒకవైపు చర్చ సాగుతోంది. అలా కాదు.. పార్టీలో మరో కీలక పదవిని సృష్టించి(వర్కింగ్ ప్రెసిడెంట్) దానిని అప్పగిస్తారని అంటున్నారు.
ప్రస్తుతం దీనికి మహానాడు వేదిక కానుందన్నది తమ్ముళ్ల మధ్య జోరుగా జరుగుతున్న చర్చ. తాజాగా చంద్రబాబు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి.. ఈ విషయాన్ని చెప్పారని కూడా పార్టీ వర్గాల మధ్య చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.