=

పాక్ కు మద్దతు ఇచ్చిన దేశాలకు ఊహించని నష్టాలు

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా దేశభక్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. పాక్‌కు మద్దతు పలికిన దేశాలపై భారతీయులు తమ స్థాయిలో గట్టిగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా పర్యాటక రంగంలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాలు పాక్ కు మద్దతు ఇవ్వగా ఇప్పుడు భారతీయుల నుంచి తీవ్ర ప్రభావం ఎదురవుతోంది.

ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ లో అక్కడికి వెళ్ళాలి అనుకున్న భారతీయులు తమ బుకింగ్‌లను వాపసు తీసుకుంటున్నారు. ప్రేమపూర్వకంగా వెళ్లే విందు పర్యటనలు ఇప్పుడు ఆగ్రహంతో మారిపోతున్నాయి. ప్రముఖ ట్రావెల్ సంస్థలు మేక్‌మైట్రిప్, ఈజ్‌మైట్రిప్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్క వారం వ్యవధిలో టర్కీకి బుకింగ్‌లు 60 శాతం తగ్గినట్టు, క్యాన్సిలేషన్లు 250 శాతం పెరిగినట్టు సమాచారం. దేశ భద్రతను గౌరవిస్తూ ఈ రెండు దేశాలకు ఉన్న ప్రమోషనల్ ఆఫర్లను నిలిపివేశామని మేక్‌మైట్రిప్ అధికారికంగా ప్రకటించింది. అజర్‌బైజాన్, టర్కీకి ఇప్పుడు ప్రయాణాలు అవసరం అయితే తప్ప, నివారించాలంటూ సూచనలు జారీ చేసింది.

ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, దేశం ముందు వ్యక్తిగత ప్రయోజనాలు చిన్నవని తెలిపారు. టర్కీకి 22 శాతం, అజర్‌బైజాన్‌కు 30 శాతం టూర్ క్యాన్సిలేషన్లు నమోదయ్యాయని వెల్లడించారు. తమ సంస్థ కూడా దేశానికి నిస్వార్థంగా నిలిచే ప్రతి పౌరుడికి తోడుగా ఉండబోతుందని చెప్పారు.

2024లో టర్కీ, అజర్‌బైజాన్‌లను కలిపి సుమారు 6 లక్షల మంది భారతీయులు సందర్శించారు. ఈ మొత్తానికి తగ్గట్టుగా వేల కోట్ల రూపాయల విదేశీ ఆదాయం ఆ దేశాలకు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు కొనసాగితే, టర్కీ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం ఉండడం ఖాయం. భారత్ వైఖరితో మిత్రదేశాలు జాగ్రత్త పడాల్సిన సమయం ఇది.