ఏపార్టీలో అయినా.. అధినేత ఒక మెట్టు దిగి వస్తే.. కార్యకర్తలు, నాయకులు రెండు మెట్లుదిగి వచ్చి అధినే తకు అనుకూలంగా మారతారు. మరి వైసీపీలోనూ ఇలానే జరిగిందా? అంటే.. ప్రశ్నలే మిగిలాయి. ఈ నెల 1న పార్టీ కార్యకర్తలు, నాయకులతో జగన్ భేటీ అయ్యారు. మేడే సందర్భంగా వారిని ప్రశంసించారు. ఈ సందర్భంగా పార్టీ బాధ్యతలనుఇక నుంచి మీకే అప్పగించాలని భావిస్తున్నా.. మీలో ఇంట్రస్ట్ ఉన్న వారు ముందుకు రండి. జిల్లాల్లోనే కాదు.. మండలస్థాయిలో కూడా పార్టీని ముందుకు నడిపించండి
అని బిగ్ ఆఫర్ ఇచ్చారు.
వాస్తవానికి వైసీపీలో ఇప్పటి వరకు జగన్ ఇలా ఆఫర్ ఇచ్చింది లేదు. పైగా ఎక్కడ ఏం జరిగినా.. తాడేపల్లి లోని కీలక నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. దీంతో పార్టీలో తమకు స్వేచ్ఛకు లేదని.. పార్టీ నిర్ణయమే శిరోధార్యం అవుతోందని నాయకులు, కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక,జగన్ కూడా కీలక నాయకులకు తప్ప ఎవరికీ చనువు ఇవ్వలేదు. అయితే.. గత ఏడాది ఎన్నికల్లో పార్టీఆ ఓడిన దరిమిలా.. కొంత మార్పు దిశగా అడుగులు వేశారు.
ఈ క్రమంలోనే పార్టీ క్షేత్రస్థాయి బాధ్యతలను అక్కడి నాయకులకే అప్పగించి పార్టీని డెవలప్ చేయాలని భావించి.. ఈ నెల 1న భారీ ఆఫర్ ప్రకటించారు. తద్వారా.. ముందుకు వచ్చే నాయకులకు కొంత శిక్షణ ఇచ్చి.. పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. వీరిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలను మినహాయించారు. అయితే..ఈ ఆఫర్ ఇచ్చి.. పది రోజులు దాటినా.. ఒక్క రు కూడా ముందుకు రాలేదు. పార్టీ జెండాను భుజాన వేసుకుంటామని కానీ.. బాధ్యతలు తీసుకుంటామని కానీ.. ఒక్కరు కూడా చెప్పలేదు.
దీంతో అంతర్గత చర్చల్లో ఈ వ్యవహారం చర్చకు వచ్చింది. పార్టీలో నాయకులు లేక కాదు. కార్యకర్తలు లేక కాదని.. కానీ, పార్టీని ముందుండి నడిపించే సాహసం ఎవరూ చేయలేక పోతున్నారని.. సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి.. తాము కనిపించామని.. రేపు మళ్లీ అధికారంలోకి వస్తే.. తమకు వాల్యూ ఇచ్చే పరిస్థితి ఉండదన్న సందేహాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనేఇప్పటి వరకు ఎవరూ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాలేదని చెబుతున్నారు. అయితే.. వచ్చేవారు ఉన్నారన్న ఆశాభావం మాత్రం వ్యక్తం చేయడం గమనార్హం.