బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. “నేను పార్టీ మారుతున్నట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. దీనిపై ఇంతకన్నా ఏమీ చెప్పలేను“ అని వ్యాఖ్యానించారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయితే..కొందరు అదే పనిగా బీఆర్ ఎస్‌పై విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గతంలోనే తాను పార్టీ మారుతానని ప్రచారం చేసిన వారికి తాను సవాల్ విసిరానని.. అప్పట్లో మౌనంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు మరోసారి తనపై తప్పుడు ప్రచారం ప్రారంభించారని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. అసలు పార్టీ మారాల్సిన అవసరం తనకు ఏముందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బీఆర్ ఎస్ పార్టీని మించి మరో పార్టీ ఉంటే అప్పుడు చర్చించేవాడినని వ్యాఖ్యానించారు. అధికారం ఉండడం లేకపోవడం.. అనేది ప్రజాస్వామ్యంలో కామనేనని.. అధికారంలో ఉంటే పార్టీలో ఉంటామని తాము ఎప్పుడూ అనబోమని చెప్పుకొచ్చారు. ఇది కొందరికి మాత్రమే వర్తిస్తుందని బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనకు ఆ అవసరం లేదన్నారు.
ఇక, పార్టీ నాయకత్వ బాధ్యతలపైనా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను కేసీఆర్ ఎవరికి అప్పగించినా.. తనకు ఇబ్బంది లేదన్నారు. కేటీఆర్‌కు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే.. తాను కూడా సహకరిస్తానని.. కేటీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు తనకుఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. కేసీఆర్ ఎలా చెబితే అలా పనిచేస్తానని చెప్పారు. ముందుగా తాను పార్టీ కార్యకర్తనని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. “కేసీఆర్‌కు క్రమశిక్షణ గల కార్యకర్తల్లో నేను ఒకడిని. ఈ విషయాన్ని గతంలోనే అనేక సందర్భాల్లో చెప్పా. ఇప్పుడు కూడా చెబుతున్నా. పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగించినా.. కేసీఆర్ చెప్పినట్టు నడుచుకోవడమే బాధ్యతగల కార్యకర్తగా నా కర్తవ్యం“ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంపై విమర్శలు..
ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం తో కల్లాంలోని ధాన్యం ఇటీవల అకాల వర్షాలతో నాశనం అయిపోయిందన్నారు. సన్నబియ్యాన్ని పూర్తిగా తామే కొంటామని చెప్పిన ప్రభుత్వం ఏమైందని ప్రశ్నించారు. రైతులు కంట నీరు పెడుతుంటే.. వీరు అందాల పోటీలతో కనువిందులు చేసుకుంటున్నారని.. కాంగ్రెస్ నాయకులను దుయ్యబట్టారు. ఇలాంటి ప్రభుత్వంతో బాధపడలేక పోతున్నామని.. క్షేత్రస్థాయిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates