ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను ఘనంగా సత్కరించి.. వారిపై కానుకలు కురిపించారు. గత రాత్రే పిఠాపురం నుంచి ప్రత్యేక బస్సుల్లో 20 మంది స్టాఫ్ నర్సులను మంగళగిరిలోని జనసేన పార్టీప్రధాన కార్యాలయానికి, తన అధికారిక కార్యాలయానికి వారిని తీసుకువచ్చారు. సోమవారం.. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారిని ఆప్యాయంగా పలకరించిన పవన్ కల్యాణ్.. వారి సేవలను కొనియాడారు.
ముఖ్యంగా తన కుమారుడు మార్క్ శంకర్.. ఇటీవల సింగపూర్‌లో అగ్నిప్రమాదంలో చిక్కుకున్న సందర్భాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నర్సులు వెన్నంటి ఉండి.. తన కుమారుడిని కాపాడారని తెలిపారు. వైద్యులు మందుల ద్వారా రోగుల ప్రాణాలను కాపాడితే.. నర్సులు తమ సేవల ద్వారా ప్రాణం పోస్తారని కొనియాడారు. నర్సుల సేవలకు ఎంత ఇచ్చినా రుణం తీరదన్న ఆయన.. నర్సుల సేవలు ఎంత కష్టంగా ఉంటాయో.. వారు వాటిని ఎంత ఇష్టంగా చేస్తారో కూడా తనకు తెలుసునని వ్యాఖ్యానించారు.
అదేసమయంలో కరోనా సమయంలో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా నర్సులు చేసిన సేవలను పవన్ కల్యాణ్ కొనియాడారు. అనంతరం.. వారికి కానుకలు ఇచ్చారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలు అందించిన 12 మంది నర్సులను ఘనంగా సత్కరించి.. వారితో ఫొటోలు దిగారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే తన నియోజకవర్గంలో 100 పడకలతో అత్యాధుని వసతులతో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం కానుందని తెలిపారు. కాగా.. ఇటీవల ఈ ఆసుపత్రికి శంకు స్థాపన చేసిన విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates