పాకిస్థాన్ తన వక్రబుద్దిని మరోసారి బయట పెట్టుకుంది. భారత్ దాడులకు భీతిల్లిన దాయాది దేశం.. అమెరికాతో మధ్యవర్తిత్వం చేయించుకుని.. కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు వచ్చింది. దీంతో భారత్ కూడా.. సరేనని ఒప్పుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాలు కూడా.. కాల్పులకు పాల్పడకూడదని.. పాల్పడవని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని, భారత్, పాకిస్థాన్‌లు కూడా ధ్రువీకరించారు. ఈ నెల 12న జరిగే సమావేశంలో ఒప్పందానికి సంబంధించిన కీలక విషయాలపై చర్చిస్తామని కూడా చెప్పాయి.
కానీ, ఒప్పందం విషయంపై ఒకవైపు ఇరు దేశాలు సహా ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలోనే రాత్రి 8.45 గంటల నుంచి కశ్మీర్‌లో పేలుళ్లు ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్ సరిహద్దుల వైపు నుంచి మోర్టార్లు, పేలుడు పదార్థాలతో తమ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాలన్నీ మోతెక్కిపోయాయని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంబంధించి వీడియోలతో సహా.. ట్వీట్ చేశారు. “కాల్పుల విరమణ ఏమైంది? జమ్ము కశ్మీర్‌లో ఈ పేలుళ్లు, మోతలు ఎందుకు?“ అని ట్విట్టర్‌లో ఆయన ప్రశ్నించారు.
శ్రీనగర్‌లో వైమానిక దళాలు.. దాడులకు తెగబడుతున్నాయని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. దీనికి సంబందించిన వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరోవైపు.. జమ్ము కశ్మీర్‌లో డ్రోన్ దాడులు జరుగుతున్నాయని `టైమ్స్ ఆఫ్ ఇండియా` కూడా సంబంధిత వీడియోలను తన వెబ్ సైట్‌లో పొందుపరిచింది. కాల్పుల విరమణకు పాక్ తూట్లు పొడిచినట్టు పేర్కొంది. అయితే.. ఈ విషయాలపై ముందుగానే అప్రమత్తమైన భారత ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉన్నా.. ఎదుర్కొనేందుకు సిద్ధమేనని మరోసారి ప్రకటించింది. సరిహద్దుల భద్రతను మరింత పటిష్టం చేసింది.
అదేవిధంగా విధుల్లో ఉన్న సైన్యాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలిన ఆదేశించింది. ఇక, ఈ వ్యవహారంపై భారత్-పాక్‌లకు మధ్యవర్తిగా వ్యవహరించిన అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా.. పాకిస్థాన్‌ను నమ్మరాదన్న విషయం మరోసారి స్పష్టమైందని మీడియా పేర్కొనడం గమనార్హం.