వైసీపీ అధినేత జగన్ .. ఇటీవల పార్టీ పార్లమెంటరీ స్థాయి ఇంచార్జ్‌లను నియమించారు. ఇది జరిగి దాదాపు వారం అవుతోంది. కీలక నాయకులు అనుకున్న వారికి, అదేవిధంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నవారికి కూడా ఈ పోస్టులు కేటాయించారు. సాధారణంగా పార్లమెంటరీ స్థాయి ఇంచార్జ్ అంటేనే.. పెద్ద పదవితో సమానం. పార్టీ స్థాయిలో చూసుకుంటే పార్లమెంటు ఇంచార్జ్‌లకు మంచి విలువతోపాటు.. పార్టీ పరంగా కూడా నాయకులతో సమన్వయం చేసుకునే అవకాశం కూడా దక్కుతుంది. ఇక, పార్టీ అధినేతతో నేరుగా చర్చించే చాన్స్ కూడా దక్కుతుంది. నాయకులపై పట్టు కూడా పెరుగుతుంది.
పార్టీలలోని ఇతర పదవుల కంటే కూడా.. పార్లమెంటరీ ఇంచార్జ్‌ల పదవులు చాలా బెటర్ అనే టాక్ కూడా ఉంది. ఇలాంటి పదవులు దక్కగానే నాయకులు ఎగిరిగంతేస్తారు. అయితే.. వైసీపీలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. నాయకుల్లో ఉత్సాహం కూడా కరువైంది. నిజానికి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి సహా.. జంకే వెంకటరెడ్డి వంటి వారికి కూడా అవకాశం ఇచ్చారు. ఫలితంగా నాయకులు ఉత్సాహంగా పనిచేసి పార్టీని పరుగులు పెట్టిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, అనుకున్న రీతిలో వీరిలో ఉత్సాహం కరువైంది. పార్టీలో ఈ నియామకాలు జరిగిన తర్వాత.. ఎవరూ బయటకు రాలేదు. కనీసంతమకు పదవులు ఇచ్చారన్న ఆనందాన్ని కూడా వెలిబుచ్చలేదు.
ఈ పరిణామం వైసీపీలో చర్చకు దారితీసింది. పార్టీ పార్లమెంటరీ ఇంచార్జ్‌లుగా బాధ్యతలు తీసుకున్నవారు ఏమయ్యారంటూ.. ప్రశ్నలు కూడా తెరమీదికి వచ్చాయి. అయినా.. ఎవరూ బయటకు రాలేదు. ఏమీ చెప్పలేదు. దీంతో జగనే జోక్యం చేసుకుని బుధవారం సమావేశం పెట్టారు. వచ్చే ఎన్నికల నాటికిపార్టీని పటిష్టం చేసే బాధ్యతను వారి భుజాలపైనే పెడుతున్నానని అన్నారు. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో పార్టీకి కాళ్లు-చేతులు కూడా పార్లమెంటరీ ఇంచార్జ్‌లేనని జగన్ చెప్పుకొచ్చారు. ఏం కావాలన్నా ఇస్తామని.. పార్టీని మాత్రం పరుగులు పెట్టించాలని జగన్ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. నాయకుల్లో కదలిక కనిపించలేదు. ఎవరూ స్పందించలేదు.
అంతేకాదు.. పార్టీ పదవులు ఇచ్చినా.. ఒకరిద్దరు నాయకులు అసలు తాడేపల్లి గేటు వైపు కూడా రాలేదని టాక్. దీనిని బట్టి.. జగన్ చేసిన ఎంపికపై అంతర్గతంగా చర్చసాగుతోంది. జగన్ వీరికి జాకీలేసి లేపుతున్నా.. వారు స్పందించడం లేదని టాక్. మరోవైపు..తమకు ప్రాధాన్యం దక్కలేదని భావిస్తున్న మరికొందరు నాయకులు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ.. జగన్ మారడన్న విషయం తెలుసుకదా..! సో.. వారు మౌనంగా ఉన్నారు. పార్టీ తరఫున పదవులు రావడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం పదవులు ఇచ్చినా.. పెద్దగా స్పందించకపోవడంతో జగన్ ప్రయత్నాలు ఏమేరకు సక్సెస్ అవుతాయన్నది చూడాలి.