సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు.. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అధిపతి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, అప్పటి గనుల శాఖ అధికారి, ఆయన బావమరిది.. ఏవీ శ్రీనివాసులు సహా పలువురికి సీబీఐ కోర్టు.. ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వారిని వెంటనే జైలుకు కూడా తరలించారు. అయితే.. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. గతంలో తెలంగాణ హైకోర్టు తప్పించిన.. మరో నిందితురాలు.. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
“ఈ కేసులో ఆమె ప్రమేయం ఉందని బలమైన ఆధారాలు ఉన్నాయి. నాడు(వైఎస్ హయాం) ఆమె మైనింగ్ శాఖ కార్యదర్శి హోదాలో సంతకాలు చేశారు. కాబట్టి.. ఆమె ప్రమేయం లేదని గుడ్డిగా నమ్మి అలా వదిలేయడానికి కుదరదు” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం శ్రీలక్ష్మి క్వాష్ పిటిషన్‌ను సవాల్ చేస్తూ.. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. గతంలో హైకోర్టు శ్రీలక్ష్మికి.. ఈ కేసుతో సంబంధం లేదంటూ ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అంతేకాదు.. తక్షణమే మరోసారి ఆమెపై వచ్చిన అభియోగాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కూడా ఆదేశించింది. ఈ విచారణను 3 మాసాల్లో పూర్తి చేసి.. తమకు నివేదికను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. గతంలో శ్రీలక్ష్మి.. తనకు ఈ కేసుతో సంబంధం లేదని.. ఇది విధానపరమైన నిర్ణయమని.. తాను ఓ అధికారిగా సంతకాలు మాత్రమే చేశానని హైకోర్టులో వాదనలు వినిపించారు. తనను కేసు నుంచి తప్పించాలని వేడుకున్నారు.
దీంతో హైకోర్టు పూర్వాపరాలు పరిశీలించి.. ఆమెను ఈ కేసు నుంచి తప్పించింది. అయితే.. తాజాగా ఈ కేసులో తుది తీర్పు వెలువడి.. శ్రీలక్ష్మి ఊపిరి పీల్చుకున్న మర్నాడే సుప్రీంకోర్టు బాంబు పేల్చడం గమనార్హం. దీంతో ఇప్పుడు మరోసారి శ్రీలక్ష్మి.. పాత్ర, ఆమె వెనుక ఎవరున్నారు? ఆమె చేసిన సంతకాలు వంటి కీలక విషయాలపై ఆది నుంచి విచారణ ప్రారంభం కానుంది.