జమ్ము కశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం పహల్గామ్‌పై ఉగ్రమూకలు దాడులు చేసి.. కులం అడిగి మరీ హతమార్చిన దారుణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రం .. కొంత ఆలస్యమైనా ఉగ్రమూకలపై బెబ్బులి లా విరుచుకుపడింది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రమూకల స్తావరాలను.. వారి ఆనవాళ్లను తునాతునకలు చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ దాడికి యావత్ భారతావనే కాకుండా.. ప్రపంచ దేశాల నుంచి కూడా మనకు సంపూర్ణ మద్దతు లభిస్తోంది.
ఇదిలావుంటే.. ఆది నుంచి కూడా ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఖండించడంతో పాటు.. పహల్గామ్ దాడుల్లో మృతి చెందిన వారి పట్ల సానుభూతి వ్యక్తం చేసిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా సిందూర్ ఆపరేషన్ పై స్పందించారు. ఆపరేషన్ సిందూర్.. ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలు. స్థావరాలపై భారత్ దాడి చేయడం.. సరైన చర్యగా ఆయన పేర్కొన్నారు.
పహల్గాం ఉగ్రదాడిలో అనేక మంది తోబుట్టువులు.. తమ ‘సిందూరాలను’ పోగొట్టుకున్నారని.. దీనికి ప్రతీ కారంగా ఉగ్రవాదులపై ఎప్పుడు కసి తీర్చుకుంటామా? అని యావత్ భారత దేశం ఎదురు చూసిందన్నారు. ఇప్పటికి వారి ఆశలను ప్రధాని మోడీ నెరవేర్చారని తెలిపారు. మోడీ నేతృత్వంలో భారత సైన్యం విజృంభించి.. పాక్ ఉగ్రవాదులకు తగిన విధంగా బుద్ది చెప్పిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి అడుగులు వేసినా తామంతా కట్టుబడి ఉంటామని చెప్పారు.
ఈ మేరకు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాటి పహల్గామ్ దాడి ఘటనను గుర్తు చేసుకున్నారు. మతం పేరు అడిగి మరీ చంపేశారని.. ఇంత దారుణం ఎప్పుడు వినలేదన్నారు. ఆఖరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు.. మోడీ పోరాటం ఆపబోరని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు మద్దతిచ్చేవా రు.. ఎవరైనా తమ విధానం మార్చుకోవాలని సూచించారు. అంతేకాదు.. భారత సైన్యంపై ఎవరూ తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దని.. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కూడా పవన్ వ్యాఖ్యానించారు.