జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఉగ్ర దాడి జరిగిన నాటి నుంచి దాడి నేపథ్యం, ఉగ్రవాదులకు అందిన సహకారం, పాక్ నుంచి లభించిన ప్రోత్సాహంపై పక్కా ఆధారాలను సేకరించిన తర్వాత ఏ ఒక్కరూ ఊహించని విధంగా బుధవారం తెల్లవారుజామున పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ తన వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ మేరకు దాడులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని బుధవారం ఉదయం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రక్షణ శాఖ ప్రతినిధులు బహిర్గతం చేశారు.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులను తిప్పికొట్టే దిశగా జరిగిన ఈ దాడుల గురించిన వివరాలను బహిర్గతం చేసే విషయంలో భారత్ తన ప్రత్యేకతను చాటుకుంది. పహల్గాం దాడిలో పలువురు మహిళలను పసుపు కుంకుమలను తెంచేసిన ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పామన్న విషయాన్ని రక్షణ శాఖలోని మహిళా అధికారులతోనే చెప్పించిన భారత ప్రభుత్వం.. భారత నారీ శక్తి బలమేమిదేనన్న విషయాన్ని యావత్తు ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ మీడియా సమావేశానికి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో పాటు భారత మిలిటరీలో పనిచేస్తున్న కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వాయు సేనలో పనిచేస్తున్న వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు పాలుపంచుకున్నారు.
ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎలా ప్రోత్సాహం ఇస్తోందన్న విషయాన్ని మిస్త్రీ వివరిస్తే… పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ లో ఏం జరిగిందన్న వివరాలను వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీలు వివరించారు. భారత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో పాక్ భూభాగంలో కొనసాగుతున్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేసినట్లు వారు తెలిపారు మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని చెప్పిన అధికారులు భారత దాడులు దిగ్విజయంగా ముగిశాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఆయా శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదులు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారన్న వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు.
ఇక భారత్ జరిపిన వైమానిక దాడులు కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని జరిగాయని సోఫియా, వ్యోమికాలు తెలిపారు. ఈ దాడుల్లో పాక్ పౌర సమాజం గానీ, ఆ దేశ సైనిక శిబిరాలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని వారు వెల్లడించారు. భారత దాడుల్లో ముంబై ఉగ్రవాద దాడులకు పాల్పడ్డ కసబ్, డేవిడ్ హెడ్లీలు శిక్షణ తీసుకున్న ఉగ్రవాద శిబిరాన్ని కూడా ధ్వంసం చేశామని తెలిపారు. నిఘా వర్గాలు ఇచ్చిన ఖచ్చితత్వ సమాచారంతో త్రివిధ దళాలు ఈ దాడులు లఖ్యాలను చేధించాయని వారు వివరించారు. పహల్ గాం దాడికి పాల్పడ్డ టీఆర్ఎఫ్ కు పాక్ నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని కూడా వారు వివరించారు. ఈ క్రమంలోనే పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయక తప్పలేదని వారు వివరించారు.