కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది అందరికీ తెలిసిన విషయం కూడా. అయితే.. ఇది రాజకీయ పరమైన నామినేటెడ్ పదవుల వ్యవహారమేనని తాజాగా తెలుస్తోంది. ఇక, రాజకీయేతర నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం.. అధికారుల పెత్తనం జోరుగా సాగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి కూటమి ప్రభుత్వంలో కలకలం రేపుతున్నాయి.
వాస్తవానికి నామినేటెడ్ పదవులు.. రాజకీయంగానే కాకుండా.. అధికార వర్గాల నుంచి కూడా జరుగుతుంది. ఇలాంటి వాటిలోనే అధికారుల పెత్తనం పెరుగుతోందని అంటున్నారు. ఇప్పటికి నాలుగు నామినేటెడ్ పదవుల విషయంలో వైసీపీకి మద్దతు దారులుగా గతంలో వ్యవహరించిన వారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక.. పదువులు దక్కించుకున్నారు. అయితే.. వీరు ఎలా వచ్చారో.. ఎవరు నియమించారో తెలియక.. ప్రభుత్వం ఇరుకునపడింది.
తాజాగా కూడా ఇలాంటి నామినేటెడ్ పదవిని వైసీపీకి చెందిన సానుభూతి పరుడు, న్యాయవాది దినేష్ కుమార్ రెడ్డిని నియమించారు. ఇది తీవ్ర వివాదంగా మారడంతోపాటు సర్కారుపై సొంత నాయకులే విమర్శలు గుప్పించారు. ఆ వెంటనే దినేష్ కుమార్‌ను తప్పించినా.. అసలు ఆయనను ఎవరు నియ మించారన్న విషయం ఆసక్తిగా మారింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు.. చిత్తూరు జిల్లాకు చెందిన ఇంచార్జ్ మంత్రిని విషయం తేల్చాలని ఆదేశించారు.
విద్యుత్ రంగ పంపిణీ సంస్థ అయిన ఏపీ ఎస్పీడీసీఎల్.. తమకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలపై కోర్టులో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు న్యాయవాదులను నియమించుకుంటుంది. ఇలా ప్రభుత్వం లోని చాలా విభాగాలు చేస్తాయి. ఈ క్రమంలోనే మదనపల్లె సర్కిల్ పరిధిలో ఎస్పీడీసీఎల్ న్యాయ అధికారిగా.. దినేష్‌రెడ్డిని నియమించారు. అయితే.. దీనివెనుక సొంత నాయకులే ఉన్నారని పార్టీ సీనియర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇది వెలుగు చూసింది.