వైసీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. వైసీపీ గత ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికి 11 మాసాలు పూర్తయినా.. ఇంకా తప్పులు వెతుకుతూనే ఉన్నామని ఆయన చెప్పారు. ఇదేసమయంలో ఆయన.. మహాభారతంలోని కర్ణుడి చావును వైసీపీ ఓటమికి లింకు పెట్టారు. “కర్ణుడి చావుకు 100 కారణాలు ఉన్నట్టే.. వైసీపీ ఓడిపోవడానికి కూడా వంద కారణాలు ఉన్నాయి. ఏం చెప్పమంటారు?” అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో బలమైన ప్రచారం చేసుకోలేకపోవడం వల్ల తాము ఇచ్చిన పథకాలు ప్రచారంలోకి రాలేకపోయాయని చెప్పారు.
అదేసమయంలో టీడీపీ అనుకూల మీడియా చేసిన వ్యతిరేక ప్రచారం కూడా వైసీపీ ఓటమికి కారణంగా మారిందని బొత్స తెలిపారు. అయితే.. పర్టిక్యులర్‌గా ఇదీ కారణం అని చెప్పడానికి తమ దగ్గర ఏమీ కారణాలు కనిపించడం లేదని చెప్పారు. నాయకుల మధ్య సఖ్యత లేదన్న మాట కేవలం కల్పితమేనన్నారు. “కూర్చున్న కొమ్మనునరుక్కుంటామని ఎలా అంటారు? అలా కాదు.. మరేవో కారణాలు ఉన్నాయి. మాపై వ్యతిరేక ప్రచారం ఎక్కువగా జరిగింది. ” అని బొత్స వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి సర్కారుపై విమర్శలు గుప్పించారు. వర్షం బీభత్సం సృష్టిస్తే.. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం 24 గంటలు గడిచిన తర్వాత కూడా.. ఏమీ చేయలేదన్నారు.
రాజధాని అమరావతికి మోడీ ఎందుకు వచ్చారో.. ఆయనకైనా తెలుసా? అని బొత్స అన్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేక పోయిందన్నారు. ప్రజలకు ఎలాంటి పథకాలూ అందడం లేదన్నారు. ఈ విషయం తమ నాయకుడు జగన్ ఎన్నికలకు ముందు కూడా చెప్పారని.. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు లక్షా 50 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని, ఆ సొమ్ములు ఏం చేశారో కూడా తెలియడం లేదని చెప్పుకొచ్చారు. త్వరలోనే జగన్ ప్రజల మధ్యకు రానున్నారని, ప్రజల సమస్యలు వింటారని బొత్స తెలిపారు. తమ పార్టీలో ఎవరు ఉన్నా.. జగన్ కోసమే పనిచేస్తారని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates