నేను చంద్ర‌బాబును చూసి నేర్చుకున్నాను: మోడీ

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి. ఇది దేవేంద్రుడి రాజ‌ధాని న‌గ‌రం పేరు. దీనిని రాజ‌ధానిగా పెట్టుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. మ‌రింత అభివృద్దిని సాధించాలి. ఈ రాజ‌ధానిని మ‌నమే పూర్తి చేయాలి. ప‌వ‌న్ క‌ల్యాణ్, చంద్ర‌బాబు.. దీనిని మ‌న‌మే పూర్తి చేయాలి అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప‌దే ప‌దే నొక్కి చెప్పారు. రాజ‌ధాని పనుల పున‌ర్నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాని.. అనంత‌రం స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. దాదాపు 60 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప‌నుల‌కు శ్రీకారం చుట్టామ‌న్న ఆయ‌న‌.. ఈ ప‌నులు పూర్త‌య్యే వ‌ర‌కు.. తాము అండ‌గా ఉంటామ‌ని చెప్పారు. రికార్డు వేగంతో ఈ ప‌నులు పూర్తి చేసేందుకు తాము స‌హ‌క‌రిస్తామ‌ని తెలిపారు.

టెక్నాల‌జీ, గ్రీన్ ఎన‌ర్జీకి అమ‌రావ‌తి కేరాఫ్‌గా నిలుస్తుంద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. “విక‌సిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోసం ఎన్టీఆర్ క‌ల‌లుక‌న్నారు. ఆ క‌ల‌ల‌ను నిజం చేయాలి. వాటిని నిజం చేసేందుకు నేను, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కృషి చేస్తాం.. సాకారం చేస్తాం” అని ప్ర‌ధాని అన్నారు. “ఈ సంద‌ర్భంగా మీకు ఓ ర‌హ‌స్యం చెబుతున్నా. టెక్నాల‌జీని నేను ప‌రిచ‌యం చేశాన‌ని అంటారు. కానీ, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. నేను చంద్ర‌బాబును చూసి నేర్చుకున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయ‌డంలోనూ.. తీసుకురావ‌డంలోనూ చంద్ర‌బాబుకు చంద్ర‌బాబే సాటి” అని మోడీ వ్యాఖ్యానించారు.

ఏపీకి కొత్త క‌నెక్టివిటీ పెరుగుతుంద‌ని ప్ర‌ధాని మోడీ తెలిపారు. రైలు, రోడ్డు మార్గాలు మ‌రిన్ని వ‌స్తాయ‌న్నారు. రైలు ప్రాజెక్టుల‌కు కేంద్ర ప్ర‌భుత్వంగా తాము భారీ ఎత్తున నిధులు స‌మ‌కూర్చామ‌ని చెప్పారు. అమ‌రావ‌తి పూర్త‌యితే.. ఏపీ ద‌శ -దిశ మారుతుం ద‌ని చెప్పారు. అమ‌రావ‌తి నిర్మాణంతో ప్ర‌తి ఆంధ్రుడి క‌ల నెర‌వేరుతుంద‌ని తెలిపారు. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక ఏపీకి గ్ర‌హణం వీడింది.. అని మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్వ‌ర్ణాంధ్ర విజ‌న్‌కు అమ‌రావ‌తి మ‌రింత శ‌క్తినిస్తుంద‌ని తెలిపారు. “నేను, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ విక‌సిత ఏపీ కోసం కృషి చేస్తాం” అని మోడీ పేర్కొన్నారు. కాగా.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ.. “తల్లి దుర్గ భవానీ కొలువైన పుణ్య భూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉంది” అని త‌న తొలి ప‌లుకులు ప్రారంభించారు.