ఐధేళ్ల పాటు యుద్ధం కొనసాగితే… ధర్మం పక్షాన నిలిచి అలుపెరగని పోరాటం చేసిన అమరావతి రైతులను విజయం వరించిందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభా వేదిక మీద ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఆసీనులై ఉన్న వేదిక మీద పనవ్ కల్యాణ్ తనదైన శైలి ప్రసంగం చేశారు. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చిన మోదీనో, లేదంటే.. తనకంటే ఉన్నత స్థానంలో ఉన్న సీఎంనో తొలుత ప్రస్తావించడానికి బదులుగా పవన్ తనదైన మార్కుతో సాగారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం బంగారం పండే తమ భూములను ఇచ్చిన రైతులను పవన్ తొలుత గుర్తు చేసుకున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. గడచిన ఐదేళ్లలో రాజధాని రైతులు పడిన ఇబ్బందులను ప్రస్తావించి వారికి సంఘీభావం తెలిపారు.
ఈ రోజు అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించుకుంటున్నామంటే.. అది అమరావతి రైతుల కృషితోనే సాధ్యమైందని పవన్ అన్నారు. వేలాది ఎకరాల భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చిన రైతులు… తమ కళ్ల ముందు రాజధాని కల నీరుగారిపోతూ ఉంటే.. రైతులు పడిన బాధతు వర్ణనాతీతమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా రాజధాని కలను సజీవంగా ఉంచుతారా? అని నాడు తనను రాజధాని రైతులు ప్రశ్నించారని గుర్తు చేసుకున్న పవన్… ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాజధాని రైతుల కలను సజీవంగా ఉంచగలిగామని, ఇప్పుడు ఆ కలను సాకారం చేస్తున్నామని కూడా చెప్పారు.
రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఐదేళ్లుగా లాఠీ దెబ్బలు తిన్నారని గుర్తు చేసుకున్న పవన్… రైతుల్లో వందల మంది ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మహిళా రైతులు పోలీసుల బూటు కాళ్ల దెబ్బలు తిన్నారని కూడా పవన్ నాటి ఘటనలను మననం చేసుకున్నారు.
అమరావతి అంటే… ఏదో ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో చెందినది కాదని పవన్ అన్నారు. అమరావతి అంటే… ఏపీలోని ఆరు కోట్ల మంది ప్రజల రాజధాని అని ఆయన అన్నారు. ప్రపంచంలోని 5 అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దే దిశగా సాగుతున్నామని, అందుకోసం సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి ఏపీకి ఎంతో సహకారం అందుతోందని పవన్ పేర్కొన్నారు. ఈ సహకారం మరింత కాలం పాటు కొనసాగుతుందని కూడా పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రం సహకారంతో ఏపీలోని కూటమి సర్కారు అమరావతిని నిర్ణీత వ్యవధిలోగానే పూర్తి చేస్తుందని ఆయన అన్నారు. యావత్తు దేశాన్ని మోదీ తన కుటుంబంగా భావిస్తున్నారన్న పవన్… ఆ క్రమంలోనే ఏపీకి ఏది కావాలన్నా కూడా లేదనకుండా ఇస్తున్నారని అన్నారు. పవన్ ప్రసంగం ముగిసిన తర్వాత పవన్ ను తన వద్దకు పిలుచుకున్న మోదీ… ఆయన చేతిలో ఓ చాక్ లెట్ పెట్టి అభినందించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates