మోదీని మంత్రముగ్ధుడిని చేసిన లోకేశ్ స్పీచ్

అమరావతి పునర్నిర్మాణ వేదిక మీద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ అదిరిపోయే ప్రసంగం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ముగ్గురు కేంద్ర మంత్రులు, మరో ముగ్గురు రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ఆసీనులు అయిన వేదిక మీద నుంచి లోకేశ్ కీలక ప్రసంగం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నమోగా అభివర్ణించిన లోకేశ్… ఆ పదాన్ని పదే పదే ప్రస్తావిస్తూ సభకు హాజరైన ప్రజల్లో నూతనోత్తేజం నింపారు. అదే సమయంలో తన ప్రసంగంతో మోదీని ఆయన అమితంగా ఆకట్టుకున్నారు. తన ప్రసంగంతో తననే ఆకట్టుకున్న లోకేశ్ ను ఆయన ప్రసంగం తర్వాత మోదీ తన వద్దకు పిలుచుకుని మరీ అభినందించడం గమనార్హం.

లోకేశ్ తన ప్రసంగం ప్రారంభంలోనే అమరావతి నమో నమ: అన్న పదాలతో ప్రారంభించి తనదైన శైలి ప్రత్యేకతను చాటుకున్నారు. పహల్ గాం ఉగ్రదాడికి నివాళి అర్పించిన లోకేశ్… ఉగ్రదాడిని వెనకుండి నడిపించిన పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో నామరూపాల్లేకుండా చేయడం మోదీకి చాలా చిన్న పనేనని లోకేశ్ అన్నారు. పాకిస్థాన్ ను సింగిల్ మిస్సైల్ తో భారత్ సర్వనాశనం చేయగలదన్న లోకేశ్… ఆ మిస్సైల్ మరెవరో కాదని, ఆ మిస్సైల్ మోదీనేనని అభివర్ణించారు. వంద పాకిస్తాన్ లు కలిసినా కూడా భారత్ ను ఏమీ చేయలేవన్న లోకేశ్… మోదీ దేశానికి ఉన్న ఒకే ఒక్క బలమని పేర్కొన్నారు. పహల్ గాం లాంటి దాడులు పునరావృతం కాకుండా చూసే దిశగా సాగుతున్న కేంద్రానికి ఏపీ సంపూర్ణ మద్దతు పలుకుతుందని కూడా లోకేశ్ ప్రకటించారు.

ఇక అమరావతి పునర్నిర్మాణాన్ని ప్రస్తావించిన లోకేశ్… అమరావతి ప్రారంభోత్సవానికి మోదీ వచ్చారని, తాజాగా అమరావతి పునర్నిర్మాణం కూడా మోదీ చేతుల మీదుగానే జరుగుతుండటం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్ణంగా అభివర్ణించారు. పహల్ గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఏపీ రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభం అనగానే… మోదీ అమరావతికి రావడం సంతోషమన్నారు. ఏపీ అంటే మోదీకి ఎంతో ఇష్టమన్న లోకేశ్.. ఈ కారణంగానే ఏపీ ఏం అడిగినా కూడా మోదీ ఇస్తూనే ఉన్నారని తెలిపారు. ఇక 2019 నుంచి ఐదేళ్ల పాటు అమరావతి నిర్మాణం అటకెక్కిన వైనాన్ని ప్రస్తావించిన లోకేశ్… రాజకీయాల ప్రస్తావన తీసుకురాకుండానే… కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి పునర్నిర్మాణం దానికదే మొదలైపోయిందని పేర్కొన్నారు. మొత్తంగా లోకేశ్ తనదైన ప్రత్యేక ప్రసంగంతో మోదీని లోకేశ్ ఆకట్టుకున్నారనే చెప్పాలి.