ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం శుక్రవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగవైభవంగా జరగనుంది. ఏపీ ప్రజలు పండుగలా భావిస్తున్న ఈ కార్యక్రమానికి వస్తున్న మోదీ… తాను అమరావతిలో అడుగుపెట్టడానికి ఓ రోజు ముందుగానే అమరావతి రిస్టార్ట్ కు ఇదో చిన్న గిఫ్ట్ అంటూ కేంద్రం నుంచి ఓ కీలక ప్రకటనను చేయించారు. అమరావతి చుట్టూరా ఏర్పాటు కానున్న అవుటర్ రింగ్ రోడ్డును గతంలో ప్రకటించినట్లుగా కాకుండా… 140 మీటర్ల వెడల్పుతో నిర్మించేలా ఈ ప్రకటనను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ గురువారమే విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) సువిశాలంగా ఏకంగా 6 లేన్లతో… 140 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు కానుంది. అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి అయ్యే వ్యయం మొత్తం రూ.35 వేల కోట్లను కేంద్రమే భరించనుంది.
వాస్తవానికి తెలుగు నేల విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా ప్రస్థానం మొదలుపెట్టిన ఏపీకి ఇతోదికంగా సాయం చేయాలని నాటి మోదీ సర్కారు భావించింది. అందుకనుగుణంగానే నాటి టీడీపీ సర్కారు చేసిన ప్రతిపాదన మేరకు అమరావతిని ఏపీకి నూతన రాజధానిగా గుర్తించిన కేంద్రం… దాని చుట్టూ ఓఆర్ఆర్ నిర్మాణానికి కూడా అనుమతించింది. అయితే నాడు 70 మీటర్ల వెడల్పుతోనే ఈ ఓఆర్ఆర్ కు కేంద్రం అనుమతించింది. నాడు కూడా ఓఆర్ఆర్ కు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే… ఓఆర్ఆర్ నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరించేలా ఒప్పందం కుదిరింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్… ఓఆర్ఆర్ అవసరం లేదని కేంద్రానికి నివేదించారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్ దుర్మార్గ పాలనను ప్రజలు చీదరించి కొట్టారు. తిరిగి టీడీపీ నేతృత్వంలని కూటమికి బ్రహ్మరథం పట్టారు. మరోమారు సీఎంగా బాధ్యతలు చేపట్టినంతనే చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో నిత్యం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్న చంద్రబాబు… అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అందుకనుగుణంగానే నగరాన్ని భారీగా నిర్మించాలని తీర్మానించిన విషయాన్ని కేంద్రానికి నివేదించారు. బాబు ప్రతిపాదనలను ఫిదా అయిన ప్రధాని మోదీ కూడా అమరావతి నిర్మాణానికి అడగంగానే… ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల మేర రుణాలను ఇప్పించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారు. ఇదే క్రమంలో మోదీ వద్ద అమరావతి ఓఆర్ఆర్ గురించి చంద్రబాబు పలుమార్లు ప్రస్తావించారు. భవిష్యత్తు అవసరాల రీత్యా 70 మీటర్ల వెడల్పుతో కూడిన ఓఆర్ఆర్ అస్సలేమీ సరిపోదని… దానిని 150 మీటర్ల వెడల్పునకు పెంచాలని విన్నవించారు.
అమరావతి ఓఆర్ఆర్ పై చంద్రబాబు కేంద్రంతో… ప్రత్యేకించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో విడతలవారీగా చర్చలు జరిపారు. ఓఆర్ఆర్ ను వీలయినంత మేర సువిశాలంగా నిర్మిస్తేనే ఏపీకి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని పదే పదే ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు ప్రతిపాదనలను పున:పరిశీలించిన గడ్కరీ… అమరావతి ఓఆర్ఆర్ ను 140 మీటర్ల వెడల్పుతో నిర్మించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి కూడా వివరించి… సరిగ్గా అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా ఓఆర్ఆర్ వెడల్పు పెంచుతున్నట్లుగా కేంద్రం నుంచి ప్రకటనను విడుదల చేయించారు. దీంతో అమరావతి పునర్నిర్మాణానికి మోదీ రూ.35 వేల కోట్ల విలువ చేసే గిఫ్ట్ ను ఓ రోజు ముందుగానే అందించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates