ఏపీకి శుక్రవారం నిజంగా ఓ పండుగే. రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను పున:ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం అమరావతి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఏపీలోని కూటమి సర్కారు మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అమరావతి రాజధాని కళ ఉట్టిపడేలా ఏర్పాట్లను కూడా ఘనంగా చేసింది. మునుపెన్నడూ లేనంత అట్టహాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి జనం శుక్రవారం ఉదయం నుంచే అమరావతి బయలుదేరారు. ఎక్కడికక్కడ కూటమి పార్టీల శ్రేణులు ప్రత్యేకంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని మరీ తండోపతండాలుగా అమరావతి తరలివస్తున్నారు. ఫలితంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికే అమరావతిలో కోలాహల వాతావరణం నెలకొంది.

అమరావతి పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానం ద్వారా చేరుకుంటారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆయన గన్నవరం నుంచి అమరావతి చేరుకుంటారు. అనంతరం రాజధాని పనుల పున:ప్రారంభంతో పాటుగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. వీటితో పాటుగా ఏపీలో కేంద్రం ఏర్పాటు చేస్తున్న పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలకు కూడా మోదీ శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం దేదీప్యమానంగా రూపొందించిన అమరావతి వేదిక మీదుగా ఆయన ఏపీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దాదాపుగా రెండున్నర గంటల పాటు మోదీ పర్యటన అమరావతిలో సాగనుంది. మోదీ పర్యటన, అమరావతి పనుల పున:ప్రారంభోత్సవ సన్నివేశాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా ఈ వేడుకకు తరలివస్తున్నారు.

రాయలసీమ జిల్లాల నుంచి వస్తున్న ప్రజలను గుంటూరు వద్ద జాతీయ రహదారి నుంచి మళ్లించి గుంటూరు… మంగళగిరి మీదుగా అమరావతి చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే వారిని ఇబ్రహీంపట్నం మీదుగా అమరావతి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ వారధి, ప్రకాశం బ్యారేజీలను అధికార యంత్రాంగం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఈ ప్రాంతాలు కూటమి పార్టీలు అయిన టీడీపీ, బీజేపీ, జనసేనల జెండాలతో రెపరెపలాడుతున్నాయి. అమరావతికి దాదాపుగా వంద కిలో మీటర్ల నుంచే రాజధాని కళ ఉట్టిపడేలా… ఓ పండుగ వాతావరణం కనిపించేలా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహాలకు నివాళులు అర్పించి మరీ కూటమి పార్టీల శ్రేణులు అమరావతి తరలివస్తున్నాయి.

అమరావతిలోని సచివాలయం వెనుక భాగాన సువిశాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను అధికార యంత్రాంగం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. అమరావతి పనుల పున:ప్రారంభం వేడుకకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారన్న భావనతో.. ప్రభుత్వం ఏర్పాట్లను కూడా భారీ ఎత్తున చేపట్టింది. ఎక్కడ కూడా చిన్న లోటు కూడా కనిపించకుండా ఏర్పాట్లు జరిగాయి. ఇందు కోసం పలువురు మంత్రులతో కమిటీనే వేసిన విషయం తెలిసిందే. వేడుక లాంటి ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా కలగని రీతిలో మంత్రుల కమిటీ ఏర్పాట్లు చేసింది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వస్తున్న నేపథ్యంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేసింది. ఏకంగా 8 వేల మందితో ప్రధాని భద్రతను కల్పించారు. ప్రధాని సభా వేదికకు వచ్చిన దగ్గర నుంచి ఆయన తిరిగి వెళ్లే దాకా సభా వేదిక పరిసరాల్లో డ్రోన్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తంగా అమరావతి పనుల పున:ప్రారంభం సందర్భంగా రాజధానిలో పండుగ వాతావరణం కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates