కొత్త‌గా రెక్క‌లొచ్చేశాయ్‌.. అమ‌రావ‌తి ప‌రుగే..!

అమ‌రావ‌తి రాజ‌ధానికి కొత్త‌గా రెక్క‌లు తొడిగాయి. సీఎం చంద్ర‌బాబు దూర‌దృష్టికి.. ఇప్పుడు ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డి దారులు క్యూక‌ట్టారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌చ్చి.. ఇక్క‌డ అమ‌రావ‌తి ప‌నులకు శంకుస్థాప‌న చేస్తున్న నేప‌థ్యంలో దీనికి మ‌రింత హైప్ వ‌చ్చింది. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు ఇక్క‌డ పాగా వేసేందుకు రెడీ కాగా.. తాజాగా అంత‌ర్జాతీయంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌, చేస్తున్న ప్ర‌చారం క‌లిసి వ‌చ్చాయి. దీంతో అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు దుబాయ్‌కి చెందిన ప‌లు సంస్థ‌లు చ‌ర్చించాయి.

ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు స్వ‌యంగా చెప్పుకొచ్చారు. సాధార‌ణంగా దుబాయ్ కు చెందిన సంస్థ‌లు పెట్టుబ‌డులు పెట్టేముందు అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తారు. గ‌తంలో వైఎస్ ఉన్నప్పుడు ఉత్త‌రాంధ్ర‌కు ఓ సంస్థ వ‌చ్చింది. అయితే.. అది వివాదం కావ‌డంతో ఏకంగా న్యాయ పోరాటం చేసి.. న‌ష్ట‌ప‌రిహారం పొందింది. అంత ప‌క్కాగా దుబాయ్ సంస్థ‌లు వ్య‌వ‌హ‌రిస్తాయి. అలానే పెట్టుబ‌డులు పెట్టి స్థానికుల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తాయి.

దుబాయ్ సంస్థ‌లు త‌మ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నాయంటే.. ఆయా రాష్ట్రాలు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుంటాయి. ఇప్పుడు ఆ అవ‌కాశం ఏపీకి ద‌క్కింది. ఇక‌, ప్ర‌ధాని రాక‌కుముందే.. మ‌రిన్ని సంస్థ‌లు స‌ర్కారుతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ప‌రిణామాలు అమ‌రావ‌తి ప‌రుగుకు నిద‌ర్శ‌నంగా ప్ర‌భుత్వం భావిస్తోంది. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం కూడా కొత్త ప్రాజెక్టుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తోంది. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ఇక్క‌డ నిర్మించేందుకు ప్ర‌తిపాద‌న‌లు రెడీ చేస్తోంది.

ఇది కూడా అంత‌ర్జాతీయంగా పెట్టుబ‌డులు రాబ‌ట్టేందుకు అవ‌కాశాల‌ను పెంచుతోంది. మ‌రోవైపు.. చంద్ర‌బాబు పై అచంచ‌ల న‌మ్మ‌కం కూడా.. అమ‌రావ‌తి పై ఉన్న అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తోంది. మూడు రాజ‌ధానుల‌ను ప్ర‌జ‌లు యాక్సెప్ట్ చేయ‌క‌పోవ‌డం కూడా.. క‌లిసి వ‌స్తోంది. ఇదే విధంగా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పనులు.. మ‌రింత భూమిని తీసుకుంటున్న వైనం వంటివి అమ‌రావ‌తి హైప్‌కు కార‌ణాలు గా క‌నిపిస్తున్నాయి. సో.. కొత్త‌గా రెక్క‌లు మొలిచిన‌ట్టుగా అమ‌రావ‌తి విజృంభించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.