జెనీలియా భర్తది భలే టైమింగ్

రేపు మరాఠి కం బాలీవుడ్ మూవీ రాజా శివాజీ థియేటర్లలో అడుగు పెడుతోంది. బొమ్మరిల్లు, ఆరెంజ్ భామ జెనీలియా డిసౌజా భర్త రితేష్ దేశముఖ్ ఇందులో హీరోగా నటించడమే కాదు దర్శకత్వం కూడా వహించాడు. ఛత్రపతి శివాజీ మీద ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినా జనం వీటి మీద చూపించే ఇంటరెస్ట్ తగ్గడం లేదు. దానికి నిదర్శనమే ఈ మూవీకి జరుగుతున్న బుకింగ్స్. ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు అమ్మగా డైరెక్ట్ కౌంటర్ సేల్స్ దీనికి మూడింతలు ఎక్కువ ఉంటాయని ఒక అంచనా.

దీన్ని ముందు ఇతర భాషల్లో డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎందుకనో నిర్ణయం మార్చుకున్నారు. గతంలో ఇదే బ్యాక్ డ్రాప్ తో వచ్చిన చావా, తానాజీ లాంటివి అద్భుత విజయం సొంతం చేసుకున్నాయి. రాజా శివాజీ కూడా అదే క్యాటగిరీలో చేరుతుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. రితేష్ కు డైరెక్షన్ చేయడం కొత్త కాదు. నాగ చైతన్య మజిలీని మరాఠిలో ‘వేద్’గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సమంత పోషించిన పాత్రలో జెనీలియా నటించింది.

రాజా శివాజీకి కలిసి వస్తున్న మరో అంశం పోటీ లేకపోవడం. దురంధర్ ది రివెంజ్ తర్వాత బాక్సాఫీస్ బాగా డల్ అయిపోయింది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, సాయిపల్లవి జంటగా నటించిన ఏక్ దిన్ అమ్మకాలు చాలా నీరసంగా ఉన్నాయి. దీని బదులు రితీష్ మూవీనే బెటరనే అభిప్రాయం టికెట్ సేల్స్ మీద ప్రభావం చూపిస్తోంది. రాజా శివాజీలో జెనీలియా, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, విద్యా బాలన్, భాగ్యశ్రీ, ఫర్దీన్ ఖాన్ లాంటి చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది.

బడ్జెట్ పరంగా కూడా రాజా శివాజీ కాస్ట్లీ గా రూపొందింది. అజయ్ అతుల్ సంగీతం సమకూర్చారు. రవితేజ షాక్, ప్రభాస్ ఆదిపురుష్ తో పాటు విజయ్ దేవరకొండ రణబాలికి మ్యూజిక్ కంపోజర్స్ వీళ్ళే. సంతోష్ శివన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. లుక్స్ పరంగా రితీష్ దేశముఖ్ మీద తొలుత కామెంట్స్ వచ్చినప్పటికీ క్రమంగా అవి తగ్గిపోయాయి. కంటెంట్ కనక మెప్పించేలా ఉంటే భారీ వసూళ్లు చూడొచ్చు. హిట్ టాక్ వస్తే నార్త్ ఇండియాలో కనక వర్షం కురుస్తుంది.