ష‌ర్మిల ర‌చ్చ రాజ‌కీయం.. ఇలా అయితే క‌ష్ట‌మే..!

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. ప్ర‌జా రాజ‌కీయాల కంటే కూడా.. ర‌చ్చ రాజ‌కీయాల‌ను ఎంచుకున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆమెకు చాలానే ఫ్యూచ‌ర్ ఉంద‌ని.. కానీ, ఆమె వేస్తున్న అడుగులు వివాదాల‌కు, విధ్వంసాల‌కు దారి తీస్తున్నాయ‌ని.. త‌ద్వారా ఆమె త‌న భ‌విత‌ను తానే కాల‌రాసుకుంటున్నార‌ని కూడా చెబుతున్నారు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వంపైనా.. రాష్ట్ర ప్ర‌భుత్వంపైనా ష‌ర్మిల చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. అటు ప్ర‌ధానిని, ఇటు సీఎంను కూడా.. విమ‌ర్శిస్తూ .. రాజ‌ధాని కేంద్రంగా ర‌చ్చ సాగించారు.

వాస్త‌వానికి ష‌ర్మిల రాజ‌కీయంగా ఎద‌గాల‌ని అనుకుంటే.. ఆమెకు అనేక అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో ఆమె గ్రామీణ పాలిటిక్స్ చేస్తే.. అక్క‌డ నుంచి ఎదిగేందుకు అటు నుంచి న‌గ‌రం వ‌ర‌కు విస్త‌రించేందుకు కూడా అవ‌కాశాలు ఉ న్నాయి. కానీ.. ఈ దిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ష‌ర్మిల ఏ మాత్రం దృష్టి పెట్ట‌లేదు. పైగా.. తిడితే.. అన్న జ‌గ‌న్‌ను మాత్ర‌మే తిట్టాల‌న్నట్టుగా.. గ‌త ప‌ది మాసాల కాలంలో ష‌ర్మిల రాజ‌కీయాలు చేశార‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. ఏ కోణంలో చూసుకున్నా.. ఇది ఆమెకు ప్ల‌స్ కాలేదు. పైగా.. ఆమె ప‌ట్ల సామాజిక మాధ్య‌మాల్లోనూ చ‌ర్చ ఆగిపోయింది.

అంతేకాదు.. సీనియ‌ర్ నాయ‌కులు కూడా.. దూరంగా ఉన్నారు. ష‌ర్మిలా.. ఆమె నాయ‌క‌త్వంలో మేం చేయ‌లేం.. అంటూ సీనియ‌ర్‌ నాయ‌కులు కాడి ప‌డేశారు. ఇది పైకి చెబుతున్న మాట కాదు. తాజాగా విజ‌యవాడ‌లో బుధ‌వారం ష‌ర్మిల చేసిన ర‌చ్చను చూస్తే.. ఆమె వెనుక ఏ ఒక్క సీనియ‌ర్ నాయ‌కుడు కూడా లేని వైనం స్ప‌ష్టంగా తెలుస్తుంది. కేవ‌లం గ‌ల్లీ స్థాయి నాయ‌కులు న‌లుగురైదుగురు మాత్ర‌మే ష‌ర్మిల వెనుక ఉన్నారు. ఇదంతా టీ-స‌మోసా బ్యాచ్‌గానే కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు భావిస్తున్నారు. నిజానికి పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి రెండో ఏడు వ‌చ్చేసినా.. సీనియ‌ర్ల‌లో ష‌ర్మిల పై స‌ద‌భిప్రాయం రాలేదు. ఇదే ఇప్పుడు ప్ర‌భావం చూపింది.

ఇక‌, మ‌రోవైపు.. అస‌లు రాజ‌ధాని అమ‌రావ‌తిపై ర‌చ్చ ఎందుకు? దీనిని క‌డుతుంటే మ‌ద్ద‌తిస్తామ‌ని ప్ర‌క‌టించిన ష‌ర్మిల‌.. రాహుల్ గాంధీలు.. ఇప్పుడు రాజ‌ధాని కోసం వ‌స్తున్న ప్ర‌ధాని మోడీకి వ్య‌తిరేకంగా ర‌చ్చ చేయ‌డం ఎందుకు? అనేది ప్ర‌శ్న‌. ఇప్పుడు కూడా మ‌ట్టే ఇస్తారా? అని ప్ర‌శ్నిస్తున్న ష‌ర్మిల‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన నిధులు.. సీఎం చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను కూడా.. ఆమె గుర్తించ‌లేక‌పోతున్నారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. కానీ.. వాస్త‌వాల‌ను విస్మ‌రించి.. కీల‌క‌మైన స‌మ‌యంలో ష‌ర్మిల చేసిన ర‌చ్చ కార‌ణంగా రాజ‌ధాని ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సానుభూతి ప‌రులు, వైఎస్ సానుభూతి ప‌రులు కూడా ఆమెకు దూర‌మ‌య్యారు. సో.. ఎలా చూసుకున్నా ష‌ర్మిల ర‌చ్చ రాజ‌కీయాలు ఆమెకు ఘోరంగా మైన‌స్ అవుతున్నాయ‌న్న చ‌ర్చ ఉంది.