ఏపీలో విపక్షం వైసీపీ గతంలో మాదిరిగా దూకుడుగా సాగడం లేదు. వైసీపీ వేస్తున్న ప్రతి అడుగూ బెడిసికొడుతుండటం, అధికార పక్షంపై తాను చేస్తున్న దాడి అంతగా వర్కవుట్ కాకపోవడం… అధికార పక్షం చేస్తున్న దాడిని తిప్పికొట్టలేక వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతుండటం ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. వెరసి వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయిందన్న మాట గట్టిగానే వినిపిస్తోంది. ఈ మాటను వైసీపీ కీలక నేతలే తమ పార్టీ శ్రేణులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో ఓపెన్ గా వ్యక్తపరుస్తున్నారు. కూటమిని తక్కువగా అంచనా వేయడానికి లేదు.. మరింత శక్తిని కూడదీసుకుని కదిలితే తప్పించి పని కాదు అంటూ కీలక నేతలు పార్టీ శ్రేణులకు ఉద్బోధ చేస్తున్నారు.
వైసీపీ అధికార ప్రతినిధులతో పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో భాగంగా సజ్జల నోట నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. కూటమి పార్టీలు చూపుతున్న దూకుడుకు కళ్లెం వేయడంలో మనం వెనకబడిపోయామని సజ్జల అన్నారట. అంతేకాకుండా మనం చేసే పనులను కూడా సరైన రీతిలో జనానికి చేరవేయడంలోనూ మనం సఫలం కాలేకపోతున్నామని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వక్ఫ్ సవరణ చట్టాన్ని పార్లమెంటులో పార్టీ పూర్తిగా వ్యతిరేకించిందని, అయితే ఆ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంభించిందని కూటమి పార్టీలు ప్రచారం చేశాయని సజ్జల గుర్తు చేశారు. ఈ ప్రచారాన్ని వైసీపీ అడ్డుకోలేకపోయిందని ఆయన తేల్చిచెప్పారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంటే… 2014లో అదికారం చేపట్టిన కూటమి కాదని సజ్జల అన్నారట. చాలా తెలివిగా… పక్కా సమాచారంతో ఎదురు దాడి చేయడంలో కూటమి పార్టీలు ఆరి తేరిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ఇంటలెక్చువల్ కూటమిని ఎదుర్కోవాలంటే… ప్రస్తుతం వైసీపీకి ఉన్న సాధనా సంపత్తి సరిపోదని ఆయన తేల్చేశారు. కూటమి తెలివైన దెబ్బను కాచుకుని… దానిని సకాంలో తిప్పికొట్టాలంటే…ఇప్పుడున్న తెలివి తేటలకు మరింత పదును పెడితే తప్పించి పని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలోనూ గతంలో వైసీపీనే బలంగా ఉండేదన్న సజ్జల… ఇప్పుడు ఆ స్థానాన్ని కూటమి…ప్రత్యేకించి టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆక్రమించిందని ఆయన తెలిపారు. తెలివి కలిగిన వారి దెబ్బను కాచుకోవాలంటే..మనమూ తెలివిని పెంచుకోవాల్సిందేనని ఆయన చెప్పారు.
ఇక పార్టీ అదికార ప్రతినిధులుగా మీడియా ముందుకు వెళ్లేటప్పుడు వినియోగించే పదజాలంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సజ్జల పార్టీ నేతలకు సూచించారు. మీడియా చర్చలు, సమావేశాల్లో ఏ పదం వినియోగించాలి?.. ఏ పదంతో ఏ మేర నష్టం వాటిల్లుతుంది? అన్నఅంశాలపై సమగ్ర అవగాహనతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మొత్తంగా నోటికి అదుపు అనేది అవసరమని… బలమైన, తెలివి కలిగిన పార్టీలతో కూడిన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆమాత్రం జాగ్రత్తలు అవసరమని కూడా సజ్జల చెప్పుకొచ్చారట. వెరసి ఇప్పుడున్న కూటమి.. గతంలో అధికారంలో ఉన్న కూటమి కాదని… ఈ కూటమి ఇంటెక్చువల్ కూటమి అంటూ చెప్పిన సజ్జల… బాబు సర్కారు దమ్మేంటన్న విషయాన్ని వైసీపీ శ్రేణులకు ఇన్నాళ్లకు గానీ వివరించారన్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates