ఉన్నారు.. లేన‌ట్టు న‌టిస్తున్నారు.. నాదెండ్లపై జ‌న‌సేన టాక్‌!

రాజ‌కీయాల్లో ఉన్నారంటే.. అందునా.. కీల‌క‌మైన పార్టీకి అంత‌క‌న్నా కీల‌క‌మైన బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నా రంటే.. స‌ద‌రు నాయ‌కుడిపై కార్య‌క‌ర్త‌ల‌తోపాటు.. పార్టీ కూడా ఎంతో న‌మ్మ‌కం పెట్టుకుంటుంది.. పార్టీని అభివృద్ధి చేస్తార‌ని.. పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపిస్తార‌ని కూడా.. అనుకుంటారు. ప్ర‌స్తుతం రోజులు మారాయి. ఇంట్లో కూర్చుని ప్రెస్‌నోట్లు రిలీజ్ చేస్తే.. ప్ర‌జ‌ల్లో పాపులారిటీ సంపాయించుకునే రోజులు లేవు. బ‌య‌ట‌కు రావాల్సిందే.. మీడియా ముందు గ‌ళం విప్పాల్సిందే! ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకుని.. దానికి అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల్సిందే. అంతేత‌ప్ప‌.. ఇంట్లోనే ఉంటాం.. ఫోన్లోనే ప‌నిచేస్తాం.. అంటే.. కుదిరే రోజులు.. స‌ర్దుకునే ప్ర‌జ‌లు కూడా లేరు. కానీ, ఇప్ప‌టికీ.. ఇలాంటి రాజ‌కీయాల‌నే న‌మ్ముకున్న ప‌నిచేస్తున్నారు మాజీ స్పీక‌ర్, జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌.

తండ్రి నాదెండ్ల భాస్క‌ర‌రావు..నుంచి వ‌చ్చిన రాజ‌కీయ వార‌స‌త్వంగా .. పాలిటిక్స్‌లోకి వ‌చ్చిన మ‌నోహ‌ర్‌. కాంగ్రెస్ హ‌యాంలో ఉమ్మ‌డి ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌గా ప‌నిచేశారు. ఆయ‌న సౌమ్యుడు.. వివాద ర‌హితు డు..వ్యూహ‌క‌ర్త‌గా కూడా పేరు తెచ్చుకుని ఉండొచ్చు. కానీ, ఇప్పుడున్న కాలానికి, మారుతున్న రాజ‌కీయాల‌కు అనుగుణంగా మాత్రం త‌న‌ను తాను మార్చుకోలేక పోతుండ‌డం ఆయ‌న‌కు పెను శాపంగా ప‌రిణ‌మించింద ‌ని.. అంటున్నారు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు నాయ‌కులు. బంగారం ఎంత మంచిదైనా కావొచ్చు.. నిప్పుల కొలిమిలో కాల‌క‌పోతే.. న‌గ త‌యార‌వుతుందా? అలాగే.. నాదెండ్ల క్లీన్ అండ్ వైట్ క్యాప‌బిలిటీ ఉన్న వ్య‌క్తే కావొచ్చు.. న‌న్ను ఎవ‌రూ ఏమీ అనొద్దు.. నేను ఎవ‌రినీ ఏమీ అన‌ను అంటే.. నేటి రాజ‌కీయాల్లో కుదురుతుందా? అనేదే ఇప్పుడు ఆయన గురించి జ‌న‌సేన నేత‌లు చేస్తున్న చ‌ర్చ‌.

ఏపీలో పుంజుకుంటాం.. అధికారంలోకి వ‌స్తాం.. అని చెబుతున్న జ‌న‌సేన త‌ర‌ఫున కీల‌క నేత‌గా ఉన్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్‌. రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌గా ఉన్నారు. సుదీర్ఘ భ‌విత‌వ్యం కూడా ఉంది. అయితే.. ఆయ‌న వాయిస్ ఎక్క‌డా వినిపించ‌డం లేదు. త‌న సొంత జిల్లా గుంటూరులో రాజ‌ధాని స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింది. రైతులు గ‌గ్గోలు పెడుతున్నారు. అయినా ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌క్తిగ‌తంగా అక్క‌డ‌కు వెళ్లింది కానీ.. అక్క‌డి రైతుల‌ను ప‌రామ‌ర్శించింది కానీ.. లేదు. ఈ పోరాటాన్ని అందిపుచ్చుకుని.. త‌న స‌త్తాను చాటుకుంది కూడా లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చిన‌ప్పుడు మాత్రం.. ఆయ‌న వెంట ఇక్క‌డ ప‌ర్య‌టించారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. నాది కాదు.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు.

ఇక‌, జ‌న‌సేన త‌ర‌ఫున వాయిస్ వినిపించేందుకు కూడా ఆయ‌న ముందుకు రావ‌డం లేదు. నిజానికి నాదెండ్ల వంటి ఉన్న‌త విద్యావంతులైన నేత‌లు ఏం మాట్లాడినా.. మీడియాలోను, జ‌నాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వ్య‌క్తిగ‌తంగా కూడా ఆయ‌న త‌న ఇమేజ్‌ను పెంచుకునేందుకు అవ‌కాశం కూడా ఉంది. అయినా కూడా.. ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌చందంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న కోల్పోతున్న దానికంటే.. కూడా.. జ‌న‌సేన‌కు తీర‌ని ఇబ్బంది ఏర్ప‌డుతోంద‌ని.. అంటున్నారు ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లే. మ‌రి ఇప్ప‌టికైనా.. నేను ఉన్నాను.. అని ముందుకు వ‌స్తారో.. లేక‌.. ఉండీ.. లేన‌ట్టేన‌ని అనుకుంటున్న సంకేతాల‌తోనే స‌రిపెడ‌తారో చూడాలి!!