తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఆదివారం వరంగల్లులో నిర్వహించిన బీఆర్ ఎస్ రజతోత్సవ సభలో బలమైన గళమే వినిపించారు. గత సమస్యలను పక్కన పెట్టి .. కేవలం కాంగ్రెస్ పాలనపైనే ఆయన ఫోకస్ పెంచారు. అదేసమయంలో తమ హయాంలో జరిగిన అభివృద్ధిని ఏకరువు పెట్టారు. మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఎంతమంది పాజిటివ్‌గా స్పందించారు? అనేది కీలకం.
ఏ నాయకుడు సభ పెట్టినా.. వచ్చిన వారి సంఖ్యతో సంబంధం లేకుండా.. ఎంత మంది దీనిపై స్పందించారన్నదే కీలకం. పైగా సుమారు 16 మాసాలుగా ఫాం హౌస్ గడప దాటని కేసీఆర్.. రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన రజతోత్సవ సభ పై పార్టీ నాయకులు, అధినేత కూడా.. భారీగానే అంచనాలు వేసుకున్నారు. ఈ సభకు జోరుగానే కార్యకర్తలను తరలించినా.. అనుకున్న ఫలితం వచ్చిందా? కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత కల్పించేలా చేసిన ప్రసంగం ఏమేరకు ఫలించిందన్నది ప్రశ్న.
వాస్తవానికి కేసీఆర్ చేసిన ప్రసంగంలో కొత్తగా చెప్పింది ఏమీలేదన్న వాదన మేధావుల నుంచి వినిపిస్తోంది. విపక్ష పార్టీగా అధికార పక్షంపై ఆయన దూకుడు చూపించారు. విమర్శలు గుప్పించారు. పథకాలు తాము ఉన్నప్పుడు వచ్చేవని.. ఇప్పుడు రావడం లేదని అన్నారు. కానీ.. ఈ తరహా ప్రయత్నాలతో పార్టీని పుంజుకునే ప్రయత్నం చేయడం కేసీఆర్ స్థాయికి సరికాదన్న వాదన వినిపిస్తోంది. మేధావులు సైతం బీఆర్ ఎస్ అధినేత ప్రసంగంపై పెదవి విరుస్తున్నారు.
“కొత్తగా చెప్పింది ఏమీ లేదు. అనుకున్న స్థాయిలో.. కేసీఆర్ పెట్టుకున్న అంచనాల స్థాయిలో ప్రజల నుంచి రియాక్షన్ రాలేదని భావిస్తున్నా“ అని ఓ కీలక విశ్లేషకుడు.. అభిప్రాయపడ్డారు. దశ-దిశ చూపించాల్సిన ఈ సమయంలో ప్రభుత్వంపై నిప్పులు చెరగడమే ధ్యేయంగా సాగిన ప్రసంగంపై ప్రజల నుంచి కూడా.. పెద్దగా రియాక్షన్ రాలేదని అన్నారు. వాస్తవానికి కేసీఆర్ ప్రసంగంపై చాలానే అంచనాలు ఉన్నాయి. కానీ.. వాటిని చేరుకునే క్రమంలో ప్రభుత్వంపై ఏకపక్షంగా విమర్శలు చేయడం.. కాకుండా.. ప్రజల కోణం నుంచి ఆయన ఆలోచించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates