ఈ రెడ్డ్లు ఇద్దరూ మాత్రం దొరకరు

ఒక‌రు మ‌ద్యం అక్ర‌మాల్లో వేల కోట్ల రూపాయ‌లు తిన్నార‌న్న‌ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. మ‌రొక‌రు గ‌నుల అక్ర‌మాల్లో వంద‌ల‌ కోట్ల రూపాయ‌లు పోగేసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు కేసుల‌కు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాల‌ను కూడా నియ‌మించింది. వారికి చేతినిండా సొమ్ములు కూడా ఇచ్చింది. ఎక్క‌డికి వెళ్లేందుకైనా.. నిందుల‌ను అరెస్టు చేసేందుకైనా కూడా అనుమ‌తులు ఇచ్చింది. అయినా.. స‌ద‌రు నిందితులు మాత్రం ఇప్ప‌టికీ దొర‌క‌లేదు. స‌రిక‌దా.. అస‌లు.. వారి ఆచూకీ కూడా ల‌భించ‌లేదు. ఈ వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

వారే.. వైసీపీకి చెందిన కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి, క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. ఉర‌ఫ్ రాజ్ క‌సిరెడ్డి. వీరిలో కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా రుస్తుంబాద‌లో అక్ర‌మంగా గ‌నులు త‌వ్వి రూ.250 కోట్ల మేర‌కు దోచేశార‌న్న‌ది టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి చేసిన ఆరోప‌ణ‌. ఇక‌, క‌సిరెడ్డి అయితే.. వైసీపీ హ‌యాంలో చిపు లిక్క‌ర్‌ను త‌యారు చేయించి.. ప్ర‌జ‌ల నుంచి(మందుబాబులు) రూ. కోట్లు పోగేసి.. త‌న వారికి త‌న పెద్ద‌నేత‌కు పంపిణీ చేశార‌న్న అభియోగాలు ఉన్నాయి. ఈ రెండు విష‌యాల‌ను కూడా ప్ర‌భుత్వం సీరియ‌స్‌గానే తీసుకుంది. కానీ.. ఇత‌ర చిన్న చిత‌క నిందితులు దొరుకుతున్నారే త‌ప్ప‌.. వీరు మాత్రం దొర‌క‌డం లేదు.

అంతా క‌సిరెడ్డే!

తాజాగా వైసీపీ మాజీ నాయ‌కుడు సాయిరెడ్డి చెప్పిన‌ట్టు అంతా క‌సిరెడ్డే మ‌ద్యం విధానాన్నిన‌డిపించార‌ని తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు కూడా నిర్ధారిస్తున్నారు. మ‌ద్యం డిస్టిల‌రీల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం నుంచి మ‌ద్యం విధానం రూపొందించే వ‌ర‌కు అన్నీ తానై క‌సిరెడ్డి వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఈ విష‌యంపై విచారించేందుకు మూడు సార్లునోటీసులు ఇచ్చినా.. ఆయ‌న ప‌ట్టించుకోలేదు. ఇంట్లో త‌నిఖీలు చేసినా.. క‌నీసం స్పందించ‌లేదు. అదేస‌మ‌యంలో కోర్టు కూడా.. ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌కుండా.. విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని చెప్పింది. అప్పుడు కూడా ఆయ‌న ఉల‌క‌లేదు. మ‌రి ఇన్నాళ్ల‌యినా.. క‌సిరెడ్డిని ప‌ట్టుకోలేక పోతుండ‌డం గ‌మ‌నార్హం.

కానుక ఇస్తా: సోమిరెడ్డి

ఇక‌, గ‌నుల అక్ర‌మాల‌కు పాల్ప‌డి.. రూ.250 కోట్ల‌ను బొక్కేశార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి కూడా.. పారిపోయిన వారి జాబితాలోనే ఉన్నారు. పోనీ.. హైకోర్టు ముంద‌స్తు బెయిల్ ఇచ్చిందా? అంటే అది కూడా లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఆచూకీ ఇప్ప‌టి వ‌ర‌కుపోలీసులు గుర్తించ‌లేక‌పోయారు. హైద‌రాబాద్‌, నెల్లూరు, బెంగ‌ళూరు అన్నారే త‌ప్ప‌.. ఎక్క‌డా ఆయ‌న ఉన్న‌ట్టు స‌మాచారం లేదు. ఇదిలావుంటే.. కాకాణిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించిన వారికి తాను కానుక ఇస్తాన‌ని టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి, కాకాణిపై ఫిర్యాదు చేసిన సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డం.. గ‌మ‌నార్హం. ఈ ప్ర‌క‌ట‌న ద్వారా స‌ర్కారుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న క్ర‌మంలో ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.