వైసీపీ పాలనలో ఏపీలో భారీ ఎత్తున మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం… విచారణను మరింత వేగవంతం చేసినట్లుగా సమాచారాం. తాజాగా సిట్ విచారణకు వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం హాజరయ్యారు. వాస్తవానికి గురువారమే ఈ విచారణకు రావాల్సిన ఆయన.. గురువారమే విజయవాడకు వచ్చినా కొన్ని కారణాల వల్ల విచారణకు హాజరు కాలేదు. తాజాగా శుక్రవారం మద్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు నేతృత్వంలోని సిట్ ముందు విచారణకు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే… ఈ కేసులో మాజీ ప్రభుత్వ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రదాన నిందితుడని, ఆయన నేతృత్వంలోనే వ్యవహారం నడిచిందని ఇదివరకటి విచారణలో సాయిరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కేసు విచారణలో సిట్ కు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. మళ్లీ పిలిస్తే మళ్లీ వస్తానని, ఈ దఫా మరింత సమాచారాన్ని కూడా అందజేస్తానని సాయిరెడ్డి చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం నాటి విచారణలో సాయిరెడ్డి నుంచి సిట్ అధికారులు మరింత కీలక సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా సమాచారం. ఈ విచారణకు సాక్షిగానే హాజరు అయిన సాయిరెడ్డి.. కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి సంబంధించిన వివరాలు ఏమైనా చెబుతారా? అన్న దిశగా ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే… ఇప్పటికే సిట్ అధికారుల కళ్లు గప్పి అండర్ గ్రౌండ్ వెళ్లిపోయిన రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నారన్న వివరాలపై సిట్ అధికారులు వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని విచారిస్తున్నారు. ఓ వైపు ఉపేందర్ రెడ్డి, మరోవైపు సాయిరెడ్డిలను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు…ఒకరు చెప్పిన సమాధానాలతో మరొకరు చెప్పిన సమాధానాలను పోలుస్తూ వాటిని బేస్ చేసుకుని కొత్త ప్రశ్నలను సంధిస్తున్నట్లు సమాచారం. పరిస్థితి చూస్తుంటే.. సాయిరెడ్డి విచారణ సాంతం రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నారన్న వివరాలను రాబట్టడంతో పాటుగా… మిథున్ రెడ్డి పాత్ర గురించిన మరింత సమాచారం సేకరించేందుకే జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ విచారణలో సాయిరెడ్డి ఏ మేర సంచలన విషయాలను చెబుతున్నారో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates