జై కిసాన్ అని సాయం చేసిన జవాన్ లకు జై..వైరల్

‘జై జవాన్..జై కిసాన్’…ఈ నినాదం గురించి తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. శత్రు దేశాల నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు సరిహద్దుల్లో పగలూ, రాత్రీ పహారా కాస్తున్న సైనికులను మనం జై జవాన్ అంటూ ఎంతో గౌరవిస్తుంటాం. ఇక, లాభం వచ్చినా..నష్టం వచ్చినా…పట్టించుకోకుండా దేశ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ పంటలు పండించే రైతులను జై కిసాన్ అని పొగుడుతాం. ఈ క్రమంలోనే జై జవాన్..జై కిసాన్ అనే స్లోగన్ కు అర్థం చెప్పే అరుదైన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. కిసాన్ కు కష్టం వస్తే జవాన్ అండగా ఉంటాడు అని నిరూపించిన ఆ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడుస్తున్న సమయంలో అటుగా వెళుతున్న జవాన్లు రంగంలోకి దిగి ఆ ధాన్యంపై పట్టలు కప్పిన ఘటన వైరల్ గా మారింది. నల్గొండ జిల్లాలో రైతులు తమ ధాన్యాన్ని రోడ్డు మీద ఓ పక్కగా ఆరబెట్టారు. ధాన్యం ఆరబోతకు వేరే స్థలం లేకపోవడంతో తప్పక రైతులు రోడ్డు మీద ఇలా ధాన్యం ఆరబెడుతుంటారు. అయితే, ఆ ప్రాంతంలో హఠాత్తుగా వర్షం పడడంతో ఆ ధాన్యం తడిచిపోతోంది. తమ గ్రామాల్లో ఉన్న రైతులు అక్కడకు చేరుకునే లోపు ఆ ధాన్యం వర్షపు నీటికి పూర్తిగా కొట్టుకుపోయే అవకాశముంది. అయితే, అదే సమయంలో తమ విధులు ముగించుకొని అటుగా వెళుతున్న జవాన్లు ధాన్యం తడిచిపోవడం గమనించారు.

క్షణం ఆలస్యం చేయకుండా యుద్ధరంగంలోకి దిగినట్లుగా యుద్ధ ప్రాతిపదికన జవాన్లు తమ వాహనంలో నుంచి కిందకు దిగారు. కదన రంగంలోకి దిగిన సైనికుల మాదిరిగా జవాన్లందరూ జట్లుగా విడిపోయి తడిచిపోతున్న ఆ ధాన్యంపై హుటాహుటిన టార్పాలిన్ పట్టలు కప్పారు. దాదాపు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నప్పటికీ…వర్షంలో తడుస్తూ తమది కాని ధాన్యాన్ని కాపాడేందుకు నిస్వార్ధంగా జవాన్లు చేసిన ఈ గొప్ప పని కోట్లాది మందిని ఫిదా చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘‘భగ భగ భగ భగ మండే…నిప్పుల వర్ష మొచ్చినా…దడ దడ దడమంటూ తూటాలు దూసుకొచ్చినా…అకాల వర్షంలో రైతులకు అండగా నిలిచినా…ఒకడే ఒకడు వాడే సైనికుడూ….సరిలేరు నీకెవ్వరూ…నువ్వెళ్ళే రహదారికి జోహారు…సరిలేరు నీకెవ్వరూ..ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు’’ అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. జై జవాన్..జై కిసాన్ అని ఊరికే అనలేదని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.