నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. మే నెల 2న అమరావతి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… రాజధాని పనులను పున:ప్రారంభించనున్నారు. ఈ మేరకు అమరావతి పర్యటనకు సంబంధించి మోదీ షెడ్యూల్ మంగళవారం ఖరారు అయ్యింది. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాటి కేబినెట్ భేటీలో ప్రకటించారు. ప్రధాని పర్యటన తర్వాత అమరావతిలో రాజధాని పనులు శరవేగంగా సాగనున్నాయి.
వాస్తవానికి ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు… ప్రధానికి ఆహ్వానం పలికారు. అయితే పలు దేశాల పర్యటన, ఇతరత్రా ముందుగానే నిర్ణయం అయిన కార్యక్రమాల నేపథ్యంలో ఏప్రిల్ లో ఏపీ పర్యటనకు మోదీ రావడం కుదరలేదు. అయితే రాజధాని పనుల పున:ప్రారంభాన్ని చేపట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ప్రధాని కార్యాలయం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే 2న మోదీ అమరావతి పర్యటనను ఖరారు చేసింది. అయితే అమరావతి పర్యటనకు మోదీ నుంచి ఇదివరకే సానుకూల స్పందన లభించిన నేపథ్యంలో… అమరావతిలో రాజధాని పనులను మోదీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లను కూటమి సర్కారు ఇదివరకే ప్రారంభించింది.
టీడీపీ గత పాలనలోనే అమరావతిలో రాజధాని పనులు ప్రారంభం కాగా.. వాటిని ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంగరంగ వైభవంగా, పూర్తి శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొని పనులను ప్రారంభించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో రాజధాని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తాజాగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినంతనే తిరిగి రాజధాని పనులకు ఊపు వచ్చింది. మధ్యలో నిలిచిన పనులను ఇప్పటికే ప్రారంభించిన కూటమి సర్కారు… కొత్తగా చేపట్టే పనులకు మోదీతో శంకుస్థాపన చేయించనుంది. ఈ కార్యక్రమాన్ని గతంలో కంటే మరింత ఘనంగా నిర్వహించేందుకు చంద్రబాబు సర్కారు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates