తాజాగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పార్టీని పరుగులు పెట్టించాలని.. పార్టీ ఇమేజ్‌ను పెంచాలని.. వచ్చే సార్వత్రిక సమరం నాటికి.. విజయం దిశగా అడుగులు వేయాలని పార్టీ నాయకులు సంకల్పించారు. తాజాగా రెండు రోజుల కిందట గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన.. ఏఐసీసీ శిఖరాగ్ర సమావేశాల్లో పార్టీ భవితవ్యాన్ని నాయకులు చర్చించారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లోనూ మార్పుల దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు.
దీనిలో భాగంగానే ఏపీ విషయం కూడా చర్చకు వచ్చింది. రాష్ట్రంలో పది సంవత్సరాలుగా పార్టీ వెంటిలేటర్‌పైనే ఉంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకించడమో..వెరసి మొత్తంగా ఏపీలో కాంగ్రెస్ అనే పేరు వినిపించకుండా పోయింది. ఈ క్రమంలోనే వైఎస్ తనయ.. వైఎస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. మహిళా సెంటిమెంటు, వైఎస్ కుమార్తెగా ఆమె ఇమేజ్ వంటివి పార్టీకి కలిసి వస్తాయని లెక్కలు వేసుకున్నారు.
అయితే… దాదాపు ఏడాది అయినా.. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో ఆమె పుంజుకునేలా చేయలేకపోయారు. పైగా.. సొంత అజెండా వ్యవహారాన్ని నాయకులు తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. దీంతో కలిసి వచ్చే నాయకులు కన్నా.. విడిపోయే నాయకులు, విడిపోతున్న నాయకులు పెరుగుతున్నారు. ఆయా వ్యవహారాలపైనా ఏఐసీసీ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ చర్చించారు. సుమారు గంటకుపైగా ఆయన అనేక విషయాలను వివరించారు.
వీటిని షర్మిలను పక్కన పెట్టి.. ఇతర నేతల వ్యవహారంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని.. యువతను ప్రోత్సహించాల్సిన అవసరం తప్పని సరి అని చెప్పారు. పాత నేతలతో పరిపుష్టంగా ఉన్న పార్టీకి జవసత్వాలు ఇవ్వాలంటే.. యువతకు ప్రాధాన్యం ఇవ్వకతప్పదన్నారు. అయితే.. షర్మిలను మాత్రం కొనసాగించి తీరాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఏపీ కాంగ్రెస్‌లో పదవుల మార్పు, యువతకు ప్రాధాన్యం పెరుగుతుందన్న అంచనాలు వస్తున్నాయి. మరి అప్పుడైనా.. షర్మిల టీం పుంజుకుంటుందేమో చూడాలి.