ఎవరైనా నాయకులు ఎన్నికలకు ముందు ఏదైనా హామీ ఇస్తే.. దానిని నెరవేర్చేందుకు సమయం పడుతుంది. పైగా గెలిచిన తర్వాత.. వారిచ్చిన హామీలను అమలు చేయాలంటూ.. ప్రజలు గుర్తు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే.. నాయకులు ఇచ్చే హామీల్లో సగానికి పైగా అమలుకు నోచుకోవడం కష్టమనే టాక్ ఉంది. అయితే.. ఈ వాదనను కొట్టి పారేస్తూ.. మంత్రి నారా లోకేష్.. తన తండ్రి చంద్రబాబుకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఆదివారం నారా లోకేష్ తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కూటమి మిత్ర పక్షాల నాయకులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా టోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సహా.. టీడీపీ నాయకులను కూడా ఆహ్వానించారు. ఎలాంటి అట్టహాసం లేకుండా.. సాధారణంగానే ఈ కార్యక్రమానికి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది ఇదే సమయానికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామని ఈ సందర్భంగా నారా లోకేష్ చెప్పారు.
అయితే.. వాస్తవానికి గత ఏడాది ఎన్నికలకు ముందు మంగళగిరిలో పర్యటించి యువగళం పాదయాత్ర చేసిన నారా లోకేష్.. తనను గెలిపిస్తే.. ఏడాదిలో 100 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు. అయితే..ఎప్పటిలాగానే.. అందరిలాగానే.. నారా లోకేష్ కూడా.. తన పనుల్లో పడి ఈ విషయం మరిచిపోతారని.. మంగళగిరి ప్రజలు అనుకున్నారు. కానీ, దీనికి భిన్నంగా.. తాను ఇచ్చిన ఏడాది గడువుకు రెండు మాసాల ముందే శంకుస్థాపన చేశారు.
అంటే.. కేవలం 10 మాసాల్లోనే సర్కారు నుంచి అనుమతులు తెచ్చుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. ప్రస్తుతం మంగళగిరి ప్రజలు సాధారణ వైద్యానికి ఎయిమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే.. ఇక్కడ పడకలు ఉన్నా.. ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇక్కడి వారికి ప్రత్యేకంగాఆసుపత్రి అవసరమని భావించిన నారా లోకేష్.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు కార్యాచరణకు పూనుకొన్నారు.