స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి  నారాలోకేష్ తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయాలన్న సంక‌ల్పం ఉండ‌బ‌ట్టే అలా చేసిన‌ట్టు చెప్పారు. తాజాగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి నిర్మాణానికి నారా లోకేష్ శంకు స్థాప‌న చేశారు. అదేస‌మ‌యంలో మ‌న ఇల్లు-మ‌న లోకేష్ కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌లువురికి ప‌ట్టాలు అందించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ కార్యాల‌యంలో మాట్లాడుతూ.. తాను ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ.. మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు త‌న‌ను ఎంతో ప్రేమ‌గా చూసుకున్నార‌ని తెలిపారు. వారి ప్రేమ‌కు తాను ఎంత చేసినా త‌క్కువేన‌ని చెప్పారు. ఎవ‌రు ఏ స‌మ‌స్య‌తో వ‌చ్చినా.. ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నించాన‌ని చాలా వ‌ర‌కు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యాయ‌ని చెప్పారు. ర‌హ‌దారుల విస్త‌ర‌ణ కూడా.. త్వ‌ర‌లోనే పూర్త‌వుతుంద‌న్నారు.

గ‌త 15 రోజుల వ్య‌వ‌ధిలోనే ఒక్క మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోనే 3 వేల మందికి ఇంటి ప‌ట్టాలు ఇచ్చిన‌ట్టు నారా లోకేష్ తెలిపారు. ఈ భూముల విలువ  రూ.వెయ్యి కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని, ప్ర‌భుత్వానికి క‌నీసంలో క‌నీసం.,. కోటి రూపాయ‌ల వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్లు సొమ్ము వ‌స్తుంద‌ని.. అయినా.. ఇక్క‌డి పేద‌ల‌ను ఆదుకునేందుకు ఆ సొమ్మును  కూడా క‌ట్టించ‌కుండా ఉచితంగానే ప్ర‌భుత్వ భూమిని వారికి రిజిస్ట్రేష‌న్ చేయించి ఇచ్చిన‌ట్టు తెలిపారు. భ‌విష్య‌త్తులో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని, ఇది చంద్ర‌బాబు దూర‌దృష్టికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు.