అసలే చిన్న కుమారుడు, ఆపై అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న వైనం.. అలాంటి కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిస్తే… ఏ తండ్రి అయినా ఇట్టే కుప్పకూలిపోతారు. జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా ఈ నెల 8న ఇదే తరహా పరిస్థితి. గిరిజన గ్రామాల రూపురేఖలు మార్చేద్దామన్న భారీ లక్ష్యంతో ఏకంగా రెండు రోజుల పాటు అరకు పరిధిలో పర్యటన కోసం ఆయన అల్లూరి సీతారామారాజు జిల్లాకు వెళ్లారు. తొలి రోజు టూర్ ముగిసి రెండో రోజు పర్యటన మొదలుకాగానే…పిడుగు లాంటి వార్త. సింగపూర్ లో ఉన్న చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడన్న వార్త పవన్ ను నిజంగానే కుంగదీసేసింది. ఇంకొకరు అయి ఉంటే… అప్పటికప్పుడు ఆ టూర్ ను ముగించుకుని పరుగున సింగపూర్ బయలుదేరేవారే.
అయితే ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రదాని నరేంద్ర మోదీ నుంచి పవన్ ఫోన్ కాల్ వచ్చింది. మోదీ నేరుగా అగ్ని ప్రమాదం గురించి వాకబు చేశారు. అధైర్యపడవద్దంటూ పవన్ కు ధైర్యం చెప్పారు. సింగపూర్ లోని భారత హై కమిషనర్ అంతా చూసుకుంటారని, బెంగ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతే… కుమారుడి పరిస్థితి గురించి ఆలోచిస్తూ కుంగిపోయిన పవన్ ఒక్కసారిగా ఆ వేదనలో నుంచి బయటపడ్డారు. ఈలోగానే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, పవన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే పలువురు నేతలు ఆయనకు ఫోన్లు చేశారు. అధైర్యపడొద్దని సముదాయించారు. ఏమీ కాదని కూడా భరోసా ఇచ్చారు. అందరం ఉన్నాం,.. అంతా చూసుకుందాం అంటూ సాంత్వన చెప్పారు. మోదీ ఇచ్చిన థర్యం, భరోసాతో అప్పటికే ఒకింత కూడబలుక్కుని లేచిన పవన్.. ఇతర నేతల మాటలతోనూ పూర్తిగా అభద్రతా భావనలో నుచి బయటపడ్డారు.
అరకు పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చి తన సోదరుడు చిరంజీవి దంపతులతో కలిసి పవన్ సింగపూర్ వెళ్లారు. కుమారుడిని చూసుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన కుమారుడికి ఓ రోజు విశ్రాంతి ఇచ్చి ఇంటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో సింగపూర్ బయలుదేరే ముందు ఏదో పొడిపొడిగా మీడియాతో మాట్లాడేసి వెళ్లిన పవన్… తాజాగా కుమారుడిని భద్రంగా ఇంటికి తీసుకువచ్చాక తీరికగా.. ఆదివారం తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన ఓ ప్రకటన రూపంలో బయటపెట్టారు. ఈ మేరకు మోదీ తనలో నింపిన ఆత్మ స్థైర్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసిన పవన్… మిగిలిన నేతలు, తన అభిమానులు, జనసైనికులకు సంబంధించి మరో ప్రక్టటన విడుదల చేశారు. ఈ ప్రకటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.
వాస్తవానికి గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టానని సదరు ప్రకటనలో పవన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కూడా ప్రధాని నరేంద్ర మోదీ విశాల ఆలోచనా దృక్పథంలో నుంచే వచ్చిందని ఆయన తెలిపారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు గిరిజన తండాలకు రోడ్డు సౌకర్య అత్యంత కీలకమైనదని తాను భావించానని.. దానిని కొనసాగించేందుకు మోదీ సర్కారు అమలు చేస్తున్న పలు పథకాలను సమన్వయం చేసుకుంటూ అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టానని ఆయన పేర్కొన్నారు. మోదీ ఆలోచన కూడా ఇదే రీతిన సాగుతుందని కూడా ఆయన తెలిపారు. మోదీ ఆదర్శాలను ఆసరాగా చేసుకుని తాను రూపొందించిన అడవి తల్లి బాటతో గిరిజనులకు ఇప్పటికీ నరకప్రాయంగా మారిన డోలీ మోతల నుంచి విముక్తి లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. చివరగా తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, కోలుకుంటున్నాడని పవన్ పేర్కొన్నారు.