సుప్రీం తీర్పు : గవర్నర్ ఆమోదం లేకుండానే… చట్టాలుగా 10 తమిళ బిల్లులు

తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ… అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా విచారణ సాగుతున్న ఓ కీలక అంశంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం తమిళనాడులోని డీఎంకే సర్కారుకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ తీర్పు నేపథ్యంలో గవర్నర్ ఆమోదంతో పని లేకుండానే… డీఎంకే సర్కారు ప్రతిపాదించిన 10 బిల్లులు చట్టాలుగా మారిపోయాయి. ఈ పరిణామం దేశంలోనే అరుదైన ఓ కొత్త సంస్కృతికి నాందీ పలికిందన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రతిపాదించే బిల్లులను గవర్నర్ లు అడ్డుకోలేరని… ఏవైనా మార్పులు ఉంటే వాటిని సవరించమని కోరడం తప్పించి… నిర్ణీత కాల వ్యవధిలోనే వాటికి ఆమోదం తెలపాల్సిందేనని సుప్రీంకోర్టు తన తీర్పులో తేల్చి చెప్పింది.

తమిళనాడులోని డీఎంకే సర్కారు… కేంద్రంలో ఎన్డీఏ సర్కారుతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగుతోంది. హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని, దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగేలా డీలిమిటేషన్ కు రంగం సిద్ధం చేస్తున్నారని ఆ పార్టీ భావిస్తోంది. ఇదే వాదనతో డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలతో ఓ సమావేశాన్ని కూడా నిర్వహించారు. మొత్తంగా కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించే దిశగానే స్టాలిన్ సాగుతున్నారన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గతేడాది తమిళనాడు అసెంబ్లీ ఓ 10 బిల్లులను ప్రవేశపెట్టి… వాటిని ఆమోదించాలంటూ గవర్నర్ ఆర్ ఎన్ రవి కుమార్ పంపింది. అయితే ఆ బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్ వాటిని తన వద్దే ఉంచుకున్నారు. ఈ వ్యవహారంపై 2024లోనే డీఎంకే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ వ్యవహారంపై సుదీర్ఘ కాలం పాటు విచారణ సాగగా… శనివారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. శాసన సభ తీర్మానించిన బిల్లులను గవర్నర్ తన ఇష్టానుసారం తొక్కి పెట్టడం కుదరదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఏదైనా బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని గవర్నర్ భావించినా… దానికి కూడా నెల గడువు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను చట్టాలుగా మార్చకుండా తొక్కిపెట్టడం కుదరదని తేల్చి చెప్పింది. శాసన సభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ నిర్ధిష్ట కాల వ్యవధిలోగా పరిష్కరించే దిశగా సాగాలని సూచించింది. మంత్రి మండలి ఆధ్వర్యంలో రూపొందే బిల్లులను శాసన సభ ఆమోదించిన తర్వాత… వాటికి ఆమోద ముద్ర వేయడం తప్పించి గవర్నర్ కు ప్రత్యామ్నాయం లేదని, రాజ్యాంగంలోని 200 అధికరణం కూడా అదే విషయాన్ని చెబుతోందని కోర్టు గుర్తు చేసింది. అంతేకాకుండా రెండోసారి శాసన సభ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపే వెసులుబాటు కూడా లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.