టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ .. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మంగళగిరి ఎమ్మెల్యేగా ఘన విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్ 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. తర్వాత నియోజకవర్గానికి కూడా ఆయన చేరువ అయ్యారు. అభివృద్ధిలోనూ.. సంక్షేమంలోనూ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు అందిస్తున్నారు.
గతంలో అనేక మంది మంగళగిరిలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో ఇలాంటివారికి ఆయా నివాసాలను పట్టాలుగా మార్చి .. హక్కు కల్పిస్తామని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. చెప్పినట్టుగానే ఆయన మంత్రి అయ్యాక.. తాజాగా ఆయా పట్టాల పంపిణీని ప్రారంభించారు. శుక్రవారం మంగళగిరి నియోజకవర్గంలోని రత్నాల చెరువు, మహా నాడు గ్రామాలకు చెందిన.. సుమారు 1650 మంది కుటుంబాలకు.. పట్టాలు ఇచ్చారు.
పట్టాల పంపిణీతోపాటు.. కుటుంబంలోని పెద్దలకు కూడా.. బట్టలు పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మంగళగిరి నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు. “వాస్తవానికి నేను మంగళగిరి నుంచి పోటీ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే.. నాకు ఈ నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేదు” అని వ్యాఖ్యానించారు. 2019లో తొలుత మంగళగిరి నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకుల నుంచి పిలుపు వచ్చిందన్నారు.
అప్పట్లో కొంత ఆలోచన చేశానన్నారు. అయితే.. చంద్రబాబు సూచనల మేరకు.. తాను మంగళగిరి నుంచి పోటీ చేశానని చెప్పారు. అయితే.. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబే తనను మంగళగిరిని వదిలేయాలని సూచించినట్టు తెలిపారు. కానీ, తాను పట్టుబట్టి.. ఓడిన చోట నుంచే గెలవాలని నిర్ణయించుకుని .. ఇక్కడ నుంచి పోటీ చేసినట్టు తెలిపారు. ఓటమి ద్వారా వచ్చిన కసి తనలో పట్టుదల పెంచిందన్నారు. అదే విజయానికి దారి తీసిసిందని వివరించారు.