ఏపీలోని గిరిజన ఓటు బ్యాంకుపై కూటమి పార్టీల్లో కీలకమైన జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా ఉన్న గిరిజన ఓట్లను తమ వైపు తిప్పుకొంటే.. బలమైన ఎస్టీ నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు అవకాశం ఉంటుందని కూడా.. భావిస్తోందా? అంటే.. ఔననే అంటు న్నారు పరిశీలకులు. 2024 ఎన్నికల్లో తొలిసారి జనసేన ఎస్టీ నియోజకవర్గంలో విజయం దక్కించుకుంది. ఇది ఊహించని పరిణామం.
అసలు ఎస్టీ నియోజకవర్గాల్లో బలమైన వైసీపీ ఓటు బ్యాంకును బదాబదలు చేయడం.. విజయం దక్కిం చుకోవడం అంటే.. సాధ్యమేనా? అనుకున్న సమయంలో జనసేన విజయం దక్కించుకుంది. అప్పటి ఎన్నికల్లో పోలవరం గిరిజన నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజుకు టికెట్ ఇచ్చిన జనసేన గెలుపు గుర్రం ఎక్కింది. అంతేకాదు.. ఈ విషయంపై అన్ని కోణాల్లోనూ అధ్యయనం కూడా చేసింది. గిరిజన ప్రాబల్య నియోజకవర్గంలోవిజయం దక్కించుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించింది.
ప్రస్తుతం గిరిజన నియోజకవర్గాలలో వైసీపీ ఓటుబ్యాంకు ఎక్కువగా ఉంది. కాంగ్రెస్‌కు పదిలంగా ఉన్న ఓటు బ్యాంకును వైసీపీ తనకు బదలాయించుకోవడంతో 2014, 2019లోనూ.. ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. ఒక్క పోలవరం మాత్రమే 2014లో టీడీపీకి దక్కింది. ఆ తర్వాత.. అక్కడ కూడా పార్టీ ఓడిపోయింది. ఇక, గత ఎన్నికల్లో మాత్రం కొంత తేడా వచ్చింది. అయినప్పటికీ.. వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకు మాత్రం ఎక్కడా చెదరలేదు. ఈ క్రమంలో ఇప్పుడు జనసేన ఆ యా నియోజకవర్గాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది.
సెంటిమెంటు+ అభివృద్ధి ఈ రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకున్న జనసేన ఆదిశగా అడుగులు వేసింది. అందుకే.. ఇటీవల అల్లూరు సీతారామరాజు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇది పక్కా రాజకీయ వ్యూహంతోనే ఆయన వేసిన అడుగులుగా.. విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే నాలుగేళ్లలో ఇదే తరహాలో జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే.. వైసీపీకి కలిసి వస్తున్న గిరిజన ఓటు బ్యాంకు ఇకపై జనసేనకు మళ్లే అవకాశం ఉందన్న చర్చ సాగుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates