కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాలు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం మొదలైన ఈ సమావేశాలు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ స్థాయిలో పార్టీ అథ్యక్షుడి నేతృత్వంలోని ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండగా… రాష్ట్రాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)లు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఇకపై ఏఐసీసీలతో పాటు జిల్లా స్థాయిల్లోని డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లు ఆయా నిర్ణయాలను తీసుకోవడం, వాటిని అమలు చేయడంలో కీలక భూమిక పోషించే దిశగా ఈ సమావేశాన్ని ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడి హోదాలో మల్లిఖార్జున ఖర్గే అధికారికంగా ప్రకటించారు.
పీసీసీలకు చైర్మన్ ఉన్నట్లుగానే డీసీసీలకు కూడా జిల్లా స్థాయిలో చైర్మన్లు ఉంటారు. పార్టీకి సంబంధించి జిల్లా స్థాయి కార్యకలాపాలన్నీ దాదాపుగా డీసీసీ చైర్మన్ దిశానిర్దేశంలోనే జరగాల్సి ఉంది. ఇక స్థానిక సంస్థలతో పాటుగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్లకు అభ్యర్థుల ఎంపికలో ప్రస్తుతానికి డీసీసీలకు ఎలాంటి పాత్ర లేదనే చెప్పాలి. స్థానిక సంస్థలు అది కూడా ఎంపీటీసీలు, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో వీరి పాత్ర ఓ మోస్తరుగా ఉన్నా… ఎంపీపీ, జడ్పీ చైర్మన్ పదవుల ఎంపికలో వీరికి ఏమాత్రం పాత్ర ఉండటం లేదు. ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థుల విషయంలో వీరి మాటను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదనే చెప్పాలి. డీసీసీ అంటే… ఆయా జిల్లాల్లోని 10 మంది ఎమ్మెల్యేల్లో కనీసం ఓ ఎమ్మెల్యే స్థాయి గౌరవం కూడా దక్కడం లేదనే చెప్పాలి. మొత్తంగా డీసీసీ చైర్మన్లు ఇప్పటిదాకా ఉత్సవ విగ్రహాల కిందే లెక్క.
అయితే తాజాగా ప్రతిపాదించిన సంస్కరణల ప్రకారం… జిల్లా పరిధిలోని ఏ పార్టీ పదవి అయినా, ప్రజా ప్రతినిధుల ఎంపిక అయినా మొత్తం డీసీసీ చైర్మన్లదే తుది నిర్ణయం. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక మొత్తం డీసీసీల ఆధ్వర్యంలోనే జరగాలని కాంగ్రెస్ తీర్మానించింది. డీసీసీలు ఎంపిక చేసిన అభ్యర్థులే బరిలో ఉంటారు. మరి అలాంటప్పుడు పీసీసీ అధ్యక్షులు ఏం చేస్తారంటే… డీసీసీలను సమన్వయం చేసుకుంటూ సాగుతారు. అంతేకాకుండా అన్ని హోదాల్లో పార్టీ నియమావళి పక్కాగా అమలు అయ్యేలా పీసీసీ పర్యవేక్షణ సాగుతుంది. వెరసి ఈ పరిణామం అమలు అయితే… పిసీసీల కంటే డీసీసీలు పవర్ సెంటర్లుగా మారతారని చెప్పవచ్చు. అంటే… ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కంటే కూడా డీసీసీ పదవులకే నేతలు ఆసక్తి చూపుతారు. చెప్పుకోవడానికి ఇదంతా బాగానే ఉన్నా… పాత కాపులు తిష్ట వేసుకుని కూర్చున్న కాంగ్రెస్ లో ఈ సంస్కరణ అమలు సాధ్యమేనా అన్న ప్రశ్నలు అప్పుడు రేకెత్తుతున్నాయి.
భారత రాజకీయ వ్యవస్థలో పార్టీ పదవుల కంటే కూడా ప్రజా ప్రతినిధులే పవర్ పుల్. డీపీపీగానో, పీసీసీగానో ఉండటం కంటే కూడా ఎమ్మెల్యే గానో, ఎంపీగానో కొనసాగేందుకే నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎమ్మెల్యే సీటు కోసం అవసరమైతే పీసీసీ పదవిని కూడా తృణప్రాయంగా వదులుకునే నేతలు చాలానే ఉన్నారని చెప్పాలి. ఇక డీసీసీ అధ్యక్ష పదవి అంటే… అదేదో ఆఫీస్ అటెండర్ మాదిరిగా పరిగణించే పరిస్థితులు ఉన్నాయి. కనీసం ఎంపీపీలు, జడ్పీటీసీలు కూడా డీసీసీ అధ్యక్షులను లెక్క చేయని పరిస్థితి చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ప్రసిద్ధికెక్కిన కాంగ్రెస్ లో ఈ నూతన సంస్కరణ అమలు అయ్యేనా అన్న దిశగా అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి. పార్టీ పదవులు అంటేనే లూప్ లైన్ పోస్టులు అన్న చందంగా పరిస్థితి మారిన నేపథ్యంలో ఈ సంస్కరణ అమలు అసాధ్యమేనని కూడా చాలా మంది పెదవి విరుస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ నూతన విధానాన్ని అమలు చేస్తుందా?.. లేదంటే చేతులు ఎత్తేస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.