జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కు జరిగిన ప్రమాదంపై తనకు అందిన వివరాలను సోమవారం రాత్రి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కీలక నేతలు తనకు ధైర్యం చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన పవన్… వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జనసేన శ్రేణులు, సినీ ప్రముఖులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమారుడికి గాయాలు అయ్యాయన్న విషయం తెలిసినంతనే ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేశారని పవన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరు, గాయపడ్డ తన కుమారుడి పరిస్థితి గురించి మోదీ తనతో ఆరా తీశారని చెప్పారు. తన కుమారుడి చికిత్స గురించి ఏం అవసరం అయినా ప్రత్యేకంగా చూసుకోవాలని ప్రధాని మోదీ.. సింగపూర్ లోని భారత హై కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారని పవన్ తెలిపారు. తన పట్ల, తన కుటుంబం పట్ల ఇంతగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో చంద్రబాబుతో పాటు లోకేశ్ కూడా తనకు ఫోన్ చేసి పరామర్శించారన్న పవన్… వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లుగా చెప్పారు.
ఇక సోషల్ మీడియా వేదికగా తన కుమారుడికి జరిగిన ప్రమాదంపై స్పందించిన జగన్ కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాాదాలు చెబుతున్నట్లు పవన్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కూడా తనను పరామర్శించారన్న పవన్… రేవంత్ కు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్, ఇతర ప్రముఖులు పలువురు తనకు ఫోన్ చేశారని పవన్ చెప్పారు. తన కుమారుడి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచిన వారందరికీ ధన్యావాాదాలు తెలుపుతున్నట్లు పవన్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates