ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని నాన్చినట్టు నాన్చినా.. బుధవారం పార్లమెంటులో ఈ బిల్లు చర్చకు వస్తున్న నేప థ్యంలో కేంద్రంలోని బీజేపీకి కీలక మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేనలు.. ఓకే చెప్పాయి. పచ్చజెండా ఊపాయి. ఫలితంగా మెజారిటీ సంఖ్య ప్రకారం.. బీజేపీకి ఇది కలిసి వచ్చే చర్య. తద్వారా.. వక్ఫ్ సవరణ బిల్లు-2024ను సునాయాసంగా నెగ్గించుకునే అవకాశం ఉంది.
అయితే.. కీలక వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు విషయంలో బీజేపీ నెత్తిన పాలు పోసిన.. టీడీపీ, జనసేనలకు ఏపీలో ఏం జరుగుతుందన్న ప్రశ్న సహజంగానే తెరమీదికి వస్తుంది. బీజేపీని వీడేది లేదని పదే పదే చెబుతున్న జనసేనకు, టీడీపీకి.. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వకతప్పని పరిస్థితి ఏర్పడింది. కానీ.. క్షేత్రస్థాయిలో చూసుకుంటే.. జనసేన మాట ఎలా ఉన్నా.. టీడీపీకి మైనారిటీ ఓటు బ్యాంకు కొంత దూరం అయ్యే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
అయితే.. రాష్ట్రంలో మైనారిటీ ఓటు బ్యాంకు 5 శాతం లోపు ఉంటుందని అంచనా. కొన్ని కొన్ని నియోజక వర్గాలు మినహా.. వారి ప్రభావం ఓవరాల్‌గా అన్ని 175 నియోజకవర్గాల్లోనూ లేదు. కాబట్టే.. టీడీపీ ఇప్పుడు సాహసోపేత నిర్ణయానికి వచ్చి ఉండాలి. నిజానికి 2014 ఎన్నికల్లోనూ.. మైనారిటీలు టీడీపీని గెలిపించలే దన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే కూడా విజయం దక్కించుకోలేదు. దీంతో మైనారిటీ ఓటు బ్యాంకు కంటే కూడా.. మిత్ర ధర్మానికే చంద్రబాబు మొగ్గు చూపారన్నది.. ప్రస్తుత అంచనా.
మరోవైపు.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మైనారీటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ విజయం దక్కించుకుంది. అయినప్పటికీ.. ఇప్పుడు వక్ఫ్ బిల్లుకు మద్దతు ప్రకటించింది. నిజానికి బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు.. మైనారిటీలు దూరమవుతారన్న చర్చ వచ్చింది. కానీ, ఇది జరగలేదు. సో.. ఇప్పుడు కూడా.. వక్ఫ్ బిల్లుకు తాము సూచించిన సవరణలకు బీజేపీ అంగీకరించడంతోనే తాము.. మద్దతు ఇచ్చామని చెబుతున్న దరిమిలా.. మైనారిటీ లు తమకు దూరం కారన్న ఆలోచనతో టీడీపీ ఉండడం గమనార్హం. ఏదేమైనా.. టీడీపీ, జనసేనలపై ఈ బిల్లు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు.