ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖ జిల్లాపై మంత్రి నారా లోకేష్ పట్టు పెంచుతున్నారు. తరచుగా విశాఖ పట్నంలో పర్యటించడంతోపాటు.. జిల్లా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. అదేసమయం లో ప్రజలకు కూడా చేరువగా ఉంటున్నారు. అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లో 11 సార్లు నారా లోకేష్ విశాఖలో పర్యటించడం గమనార్హం. ప్రతిసారీ ఆయన ప్రజలకు చేరువ అవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.
తాజాగా నారా లోకేష్ ఆదివారం నుంచే విశాఖలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకం నుంచి అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా రెగ్యులరైజేషన్ కాకుండా ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలను కేవలం డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్ధతిలో మాత్రమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ సమాఖ్య ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
విశాఖ పెందుర్తి నియోజకవర్గం వేపగుంట జెడ్ పీహెచ్ స్కూల్ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వ అండతో కబ్జా చేసి భవనాలు నిర్మించారని, సదరు స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని విశాఖకు చెందిన రేపర్తి రాజు విజ్ఞప్తి చేశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, రెవెన్యూ డీటీగా పనిచేసి రిటైర్డ్ అయినప్పటికీ ఏఎస్ఆర్ జిల్లా సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏలో పనిచేస్తూ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న టి.అప్పారావు, ఈశ్వర్ రావులను తొలగించి అర్హులను నియమించాలని పాడేరుకు చెందిన ఎన్.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
ఒకవైపు ప్రజల నుంచి అర్జీలు తీసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తూనే మరోవైపు.. రాజకీయం గా టీడీపీని బలోపేతం చేసే దిశగా కూడా నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ బలం తగ్గడంతో ఆపార్టీ నుంచి చేరికలను ప్రోత్సహించే దిశగా స్థానిక నాయకులు మంత్రాంగాలు చేస్తున్నారు. అయితే.. బలమైన వ్యక్తులను మాత్రమే చేర్చుకునేందుకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో పలువురు నాయకులు నారా లోకేష్‌ను కలిసి.. తమ అభిమతాన్ని విన్నవించారు. మొత్తంగా అటు మంగళగిరిలోనూ.. ఇటు విశాఖలోనూ నారా లోకేష్ పట్టు పెంచుకుంటుండడం గమనార్హం.