తెలుగుదేశం పార్టీ సృష్టించిన రికార్డును ఎవరూ చెరపలేరని.. ఎవరూ తిరగరాయలేరని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. టీడీపీ 43వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం.. పార్టీ నాయకులు, అభిమానుల మధ్య 43 కేజీల కేక్‌ను కట్ చేసి.. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “ఒక మహనీయుడి విజన్ తెలుగు దేశం పార్టీ” అని అన్నారు. ఒక సమున్నత లక్ష్యంతో టీడీపీ జన్మించిందన్నారు. పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే టీడీపీ అధికారం దక్కించుకుని చరిత్ర సృష్టించిందన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ తాపత్రయపడ్డారని తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగు వారి కోసం ఆయన పార్టీని స్థాపించారని చెప్పారు. టీడీపీకి ప్రతి ఒక్కరూ వారసులేనని చంద్రబాబు చెప్పారు.
తాను కేవలం పార్టీకి అధ్యక్షుడిని మాత్రమేనని.. అందరం పార్టీకి వారసులమేనని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక ఆదర్శం కోసం.. ఒక ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీనేనని చెప్పారు. ఎన్టీఆర్‌లాంటి వ్యక్తి మళ్లీ జన్మించబోరని చెప్పారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టాలంటూ.. మళ్లీ ఎన్టీఆరే పుట్టాలని వ్యాఖ్యానించారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ కోసం కృషి చేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు.
తెలుగు నేల, తెలుగు వారు ఎక్కడున్నా.. సగర్వంగా చెప్పుకొనేలా పార్టీని తీర్చిదిద్దామని చంద్రబాబు చెప్పారు. “మేం పెత్తందారులం కాదు. సేవకులం. పార్టీలోనే ఉన్న ప్రతికార్యకర్తకు ఏ కష్టం వచ్చినా.. ఆదుకుంటాం” అని చంద్రబాబు నొక్కిచెప్పారు. “పార్టీని లేకుండా చేయాలని అనుకున్నవారు.. ఇప్పుడు లేకుండా పోయారు. కాల గర్భంలో కలిసిపోయారు. టీడీపీది ప్రజా బలం, ముహూర్త బలం.” అని వ్యాఖ్యానిస్తూ.. వైసీపీ అధినేత జగన్‌ను పరోక్షంగా విమర్శించారు.