జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరును తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కు అసలు హిందూ ధర్మంపైనా, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే అర్హత ఉందా? అంటూ జగన్ ఫైరైపోయారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలోని కాశినాయన ఆశ్రమం కూల్చివేతలకు సంబంధించిన అంశాన్ని ఆసరా చేసుకుని జగన్ చేసిన విమర్శలు ఇఫ్పుడు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్టును పెట్టిన జగన్.. పవన్ తో పాటు మొత్తం కూటమి సర్కారు తీరునూ విమర్శిస్తూ ఆయన పలు ఆధారాలను కూడా జత చేశారు.
నిత్యం వేలాది మందికి అన్నదానం చేస్తూ కాశినాయన ఆశ్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ సంపాదించకుంది. అయితే ఈ ఆశ్రమం బద్వేలు పరిదిలోని అటవీ శాఖకు చెందిన టైగర్ రిజర్వ్ పరిధిలోని భూముల్లో ఉంది. ఇదే కారణాన్ని చూపుతూ ఇటీవలే అటవీ శాఖ అధికారులు ఆశ్రమంలోని పలు నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతలపై జనం నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది. ఈ నిరసనలతో వేగంగా స్పందించిన టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కూలిన భవనాల స్థానంలో కొత్త భవనాలను నిర్మించారు. ఇందుకోసం ఆయన తన సొంత నిధులను వెచ్చించారు. కేవలం మూడంటే మూడు రోజుల్లోనే ఈ భవన నిర్మాణాలను లోకేశ్ పూర్తి చేయించారు.
కాశినాయన ఆశ్రమం కూల్చివేతలపై లోకేశ్ వేగంగా స్పందించినా… అటవీ శాఖను పర్యవేక్షిస్తున్న పవన్ కల్యాణ్ మాత్రం కారణమేమిటో తెలియదు గానీ స్పందించలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన జగన్… అటవీ శాఖ మంత్రి హోదాలో ఉండి కూడా పవన్ కాశినాయన ఆశ్రమాన్ని కూల్చివేస్తే స్పందించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా కేంద్ర అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తే… వాటిని రాష్ట్ర అటవీ శాఖే అమలు చేసిందని… జిల్లా కలెక్టర్, ఆర్డీఓల సాయంతో కాశినాయన ఆశ్రమాన్ని కూల్చివేశారని జగన్ ధ్వజమెత్తారు. ఈ లెక్కన కాశినాయన ఆశ్రమాన్ని కూల్చి వేయించింది అటవీ శాఖే కదా అని…ఆ శాఖను పర్యవేక్షిస్తున్న పవన్ కు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.
వాళ్లే కూల్చేస్తారు.. ఆ తర్వాత వాళ్లే పరిరక్షణ అంటూ మాటలు చెబుతారంటూ జగన్ ధ్వజమెత్తారు. అయినా కాశినాయన ఆశ్రమం మూల్చివేత, దాని పునర్నిర్మాణం జరిగి చాలా రోజులే అయ్యింది కదా… జగన్ ఇప్పుడు దీనిపై ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న విషయానికి వస్తే..కాశినాయన ఆశ్రయానికి సంబంధించిన విషయాలపై జగన్ కు ఇటీవలే ఓ అర్జీ అందిందట. దానికి పలు వివరాలు కూడా జతకూడి వచ్చాయట. దీంతో వాటిని అన్నింటినీ పరిశీలించిన జగన్… తాజాగా పవన్ తీరును నిరసిస్తూ పోస్టు పెట్టారు. ఇక కాశినాయన ఆశ్రమాన్ని కూల్చేస్తామంటూ తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రం సిద్ధపడితే… తామే నిలువరించామని ఆయన తెలిపారు. కేంద్ర అటవీ శాఖ మంత్రికి సీఎం హోదాలో తానే లేఖ రాశానని కూడా జగన్ తెలిపారు. అయితే కూటమి సర్కారు వచ్చినంతనే కావాలనే కాశినాయన ఆశ్రమాన్ని కూల్చేసే దిశగా అడుగులు పడ్డాయని ఆయన ఆరోపించారు.