టీడీపీని ఎంతగా లైన్‌లో పెట్టాలని భావిస్తున్నా.. ఇంకా కుదరడం లేదు. చంద్రబాబుకు తలనొప్పులు వదలడం లేదు. పార్టీలో ఐకమత్యం పెంచాలని, చిన్న చిన్న అభిప్రాయ భేదాలను తగ్గించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పార్టీ ఓటమి తర్వాత కుంగిపోయిన నేతలను మళ్లీ లైన్‌లో పెట్టి .. పార్టీకి పునర్వైభవం సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పటికీ.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు మారకపోగా .. మరింత జఠిలం అవుతున్నాయి. మరి దీనికి కారణం ఏంటి? అనే చర్చ జోరుగా సాగుతోంది.
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం టీడీపీలో ఆదిపత్య పోరు.. సెగలు.. పొగలు కక్కుతోంది. టీడీపీలో కీలక నేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరుకు ఢీ అంటే ఢీ అనేలా రోడ్డెక్కుతున్నారు. దీంతో పార్టీలో చీలికలు ఏర్పడుతున్నాయి. 2014 వరకు ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకురాలు.. శమంతకమణి హవా కొనసాగింది. ఆమె పలుమార్లు ఇక్కడ విజయం సాధించారు. ఇక, ఆమె వారసురాలిగా యామినీబాల అరంగేట్రం చేశారు. 2014లో విజయం సాధించారు. ప్రభుత్వ విప్ గా కూడా కొనసాగారు.
అయితే, జేసీ దివాకర్ రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో యామినీబాల ఆశించిన దూకుడు చూపించలేక పోయారు. పైగా ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి తోడు శమంతకమణి స్వయంగా తన కుమార్తెకు టికెట్ ఇవ్వొద్దంటూ.. బాబుకు లేఖ రాయడం మరింత వివాదానికి కారణమైంది. దీంతో గత ఏడాది ఎన్నికల్లో చంద్రబాబు అనూహ్యంగా బండారు శ్రావణి అనే యువ నాయకురాలికి అవకాశం ఇచ్చా రు. ఆమె ఓడిపోయారు. అయితే.. ఈ ఓటమికి కారణాలు పేర్కొంటూ.. నాలుగు పేజల లేఖను ఆమె చంద్రబాబుకు సంధించారు. స్థానిక నాయకుడు ఎం.ఎస్ రాజు.. కారణంగానే తాను ఓడిపోయానని, ఆయన పరోక్షంగా తన ఓటమికి కారణమంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు.. ఏమనుకున్నారో.. ఏమో.. ఎం.ఎస్.రాజుకు ఏకంగా టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టెబట్టారు. ఈ పరిణామం.. బండారు శ్రావణికి ఆమె వర్గానికి ఏమాత్రం రుచించలేదు. దీంతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే, సింగనమల టీడీపీ ఇంచార్జ్‌గా మాత్రం ఆమే కొనసాగుతున్నారు. కానీ, రాజుతో మాత్రం విభేదిస్తున్నారు. రాజు మరింత దూకుడు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. అదేసమయంలో నియోజవకర్గంలోనూ అన్నీ తానై చక్కబెడుతున్నారు. దీంతో నియోజకవర్గం ఇంచార్జ్‌నైన నాకు చెప్పకుండానే కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారంటూ.. మీడియా మీటింగులు పెట్టి.. రాజును ఏకేస్తున్నారు శ్రావణి.
ఇటీవల జిల్లా పర్యటనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ వచ్చారు. ఈ పర్యటనకు శ్రావణి కానీ, ఆమె అనుచరులు కానీ రాలేదు. పైగా పర్యటన ముగిసిన తర్వాత.. ప్రెస్‌నోట్ ఇచ్చారు. కనీసం నాకు చెప్పాల్సిన అవసరం లేదా? అంటూ.. విరుచుకుపడ్డారు. ఇక, లోకేష్ పర్యటనలో రాజు హల్‌చల్ చేశారు. నియోజకవర్గంలో తన అనుచరులను తీసుకువెళ్లి.. లోకేష్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ పరిణామాలతో శ్రావణి మరింతగా ఉడికిపోతున్నారు.
ఇదిలావుంటే, వీరిద్దరి మధ్య ఉన్న గ్యాప్‌ను వైసీపీ నాయకురాలు, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. తనకు అనుకూలంగా మార్చుకుని.. టీడీపీలో తటస్థ కేడర్‌ను తనవైపునకు తిప్పుకొంటున్నారు. ఈ పరిణామాలతో సింగనమల టీడీపీలో చీలికలు వస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. మరి చంద్రబాబు ఇప్పటికైనా పట్టించుకుని సరిచేస్తారో లేదో చూడాలి.