ఏపీ ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. ఇది అన్ని వర్గాల ప్రజల్లోనా.. లేక, కొందరిలోనేనా అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం మెజారిటీ ప్రజలు కూటమి సర్కారు తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రతిపక్షం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది. ఇది కొంత వాస్తవమే అయినా.. ప్రజల్లోనూ మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం సూపర్ సిక్స్‌లో ఉచిత సిలిండర్ అమలవుతోంది.
ఇతర పథకాలను కూడా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలో రాష్ట్ర వ్యాప్తంగా.. ప్రజలకు నిత్యం అవసరమైన రహదారుల నిర్మాణం వ్యవహారం చర్చకు వస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు లెక్క తప్పకుండా అనేక పథకాలు అమలు చేసినప్పటికీ.. చివరకు కీలకమైన అభివృద్ధి విషయంలో జాప్యం చేసి నిర్లక్ష్యం చేసిన కారణంగా.. సర్కారు పడిపోయిన పరిస్థితి ఎదరైంది. ఇది ఆ పార్టీ భవితవ్యాన్ని కూడా దెబ్బతీసింది.
దీనిని దృష్టిలో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తూనే.. మరోవైపు పథకాలకు సైతం నిధులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే రహదారులకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ 2 వేల కిలో మీటర్ల పైచిలుకు రహదారుల నిర్మాణం, బాగుచేతలు పూర్తయ్యాయి. అంతేకాదు.. కొన్ని గ్రామాల్లో కొత్తగా నిర్మించిన రహదారుల కారణంగా.. ఆయా గ్రామాల రూపు రేఖలు సైతం మారిపోయాయి.
అంటే.. ప్రజలకు నిత్యం అవసరమైన రహదారులు దాదాపు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రభావం పథకాలపై ఉన్న వ్యతిరేకతను తుడిచి పెట్టేసిందన్న చర్చ సాగుతోంది. అంతేకాదు.. ఇప్పుడు ఎవరు కలిసినా.. తమ ప్రాంతంలో అందుబాటులోకి వచ్చిన రహదారుల అంశాన్ని చర్చించుకుంటున్నారు. గతానికి ఇప్పటికి ఉన్న తేడాపైనా మాట్లాడుకుంటున్నారు. పథకాలు ఇవ్వకపోయినా.. ఫర్లేదు.. రోడ్డు బాగుపడ్డాయని చాలా మంది వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సో.. ఇదీ.. సంగతి!