ఏపీ గిరి పుత్రులు పండిస్తున్న సేంద్రీయ అరకు కాఫీ రుచులు విశ్వవ్యాప్తంగా విస్తరించాలన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంకల్పంలో సోమవారం ఓ కీలక ఘట్టం పూర్తి అయ్యింది. చంద్రబాబు కృషితో ఇప్పటికే అరకు కాఫీకి జియో ట్యాగ్ గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా భారత అత్యున్నత చట్టసభ పారమెంటులోకి అరకు కాఫీ సగర్వంగా ఎంట్రీ ఇచ్చింది. సోమవారం పార్లమెంటు ఆవరణలోని లోక్ సభ, రాజ్యసభ పరిధుల్లో రెండు అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు అయ్యాయి.
ఏపీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీకి చెందిన కూటమి పార్లమెంటు సభ్యులు, ఏపీ ప్రభుత్వం నుంచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, గిరిజిన సహకార సంస్థ డైరెక్టర్లు హాజరైన ఈ కార్యక్రమాల్లో భాగంగా లోక్ సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అరకు స్టాల్ ను ప్రారంబించారు. ఆ తర్వాత మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభ ప్రాంగణంలో అరకు స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు కాఫీని సేవిస్తూ వారంతా ఫొటోలకు ఫోజులిచ్చారు.
అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్త గుర్తింపు సాధించాలన్న దిశగా సాగుతున్న చంద్రబాబు… రాష్ట్రానికి వచ్చే అతిథులకు అరకు కాఫీతో ప్రత్యేకంగా రూపొందించిన గిఫ్ట్ ప్యాక్ లను అందిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా…తాను బేటీ అయ్యే ప్రముఖులకు ఆ ప్యాకెట్లను అందిస్తూ సాగుతున్నారు. అరకు కాఫీ ప్రత్యేకతను గురించి వివరిస్తున్నారు. ఇటీవలి దావోస్ సదస్సులోనూ ఏపీ పెవిలియన్ లో అరకు కాఫీ స్టాల్ ను ఏర్పాటు చేయించారు. ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఆవరణలోనూ అరకు స్టాల్ ను ఏర్పాటు చేయించిన చంద్రబాబు… తాజాగా పార్లమెంటులోనూ అరకు కాఫీని అందుబాటులోకి తీసుకువచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates