వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం.. పులివెందులలో రైతులకు భారీ కష్టం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో అరటి, చీనీ(బత్తాయి) తోటలు వేలాది ఎకరాల్లో నేలమట్టం అయ్యాయి. ఇలాంటి సమయంలో స్థానిక ఎమ్మెల్యేగా జగన్ స్పందించాల్సి ఉంది. రైతుల కష్టాలు తెలుసుకుని సర్కారు ద్వారా వారికి సాయం అందించాల్సి ఉంటుంది.
కానీ, జగన్ సోమవారం మధ్యాహ్నం దాకా స్పందించలేదు. అసలు పులివెందులలో ఏం జరిగిందన్న విషయంపైనా ఆయన ఆరా తీయలేక పోయారు. ప్రస్తుతం ఆయన సొంత పనిపై ఉన్నట్టు తెలిసింది. కానీ, ఈ సమయంలో తమ ప్రత్యర్థి నాయకుడి సొంత నియోజకవర్గమే అయినా.. తమకు ఇక్కడ ఒక్కసారి కూడా గెలుపు దక్కలేదని తెలిసినా.. టీడీపీ నాయకులు స్పందించారు. ముఖ్యంగా ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. పులివెందులలో ఏం జరిగిందో తెలుసుకుని తమకు సమాచారం ఇవ్వాలని కడప కలెక్టర్‌ను ఆదేశించింది.
మరీ ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డిలు.. స్థానిక రైతాంగం విషయాలపై ఆరా తీశారు. నేరుగా భూమిరెడ్డిని క్షేత్రస్తాయికి పంపించిన ప్రభుత్వం .. అక్కడి నుంచే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయిందీ తెలుసుకుంది. వడగళ్ల వానకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు లేకపోవడంపైనా ఆరా తీసిన ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని.. నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
అయితే.. ఇంత జరిగినా.. సొంత నియోజకవర్గంపై పట్టించుకోని జగన్ వ్యవహారంపై.. మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సమస్య వచ్చినా.. సొంత నియోజకవర్గాన్ని ఆదుకునేందుకు ఎమ్మెల్యే లు రెడీగా ఉంటారని.. కానీ, జగన్ మాత్రం సొంత పనుల్లో బిజీగా ఉన్నారని.. వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా. పులివెందులలో కూడా జగన్ ఓటమి ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు. తాము రైతులకు అండగా ఉంటామని మీడియాకు చెప్పారు.