పవన్ అభిలాష… బాబు హ్యాట్రిక్ కొట్టాలి

ఏపీలోని అధికార కూటమి సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉండాలని… ఆ కూటమిలోని కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిలషించారు. ఆ సుధీర్ఘ కాలం పాటు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కూడా ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. అంతేకాదండోయ్… అలా చంద్రబాబు సుధీర్ఘ కాలం పాటు సీఎంగా కొనసాగుతూ ఉంటే… తాను ఆయన కిందే పనిచేసుకుంటూ సాగుతానని కూడా పవన్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మాటలు వింటున్న చంద్రబాబు… టీడీపీ, జనసేన నేతలు పవన్ వైపు అలా చూస్తూ ఉండిపోయారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ముగియగా… సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక చివరి రోజు అయిన గురువారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ప్రజా ప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సంబరాల్లో చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. నిజంగానే ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన ఎమ్మెల్యేల్లో ఇంత ప్రతిభ ఉందా? అని జనం అంతా నోరెళ్లబెట్టేశారు. టీవీ తెరలకు కళ్లప్పగించేసి వేడుక ముగిసే దాకా అలా కూర్చుండిపోయారు. ఈ వేడుకలు ముగిసిన తర్వాత తొలుత పవన్ కల్యాణే ప్రసంగించారు. ఈ సందర్భంగానే బాబు గురించి, కూటమి గురించి, తన గురించి పవన్ తన మనసులోని మాటలను బయటపెట్టారు.

దేశానికి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రదాని అయ్యారన్న పవన్… మోదీ మాదిరే చంద్రబాబు కూడా ఏపీకి వరుసగా మూడు సార్లు సీఎంగా కొనసాగాలని, రానున్న 15 ఏళ్ల పాటు ఆయన సీఎంగానే కొనసాగాలని అభిలషించారు. వెరసి మోదీ మాదిరే చంద్రబాబు కూడా సీఎంగా హ్యాట్రిక్ కొట్టాలని తాను బలంగా కోరుకుంటున్నానని పవన్ అన్నారు. ఆ 15 ఏళ్ల కాలం కూడా తాను చంద్రబాబు కిందే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలనలో అనుభవశీలిగా ఉన్న చంద్రబాబు 15 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగితే… ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రం బయటపడుతుందని, బంగారు భవిష్యత్తు ప్రజలకు అందుతుందని పవన్ అన్నారు. మొత్తంగా చంద్రబాబుపై, ఆయన పనితీరుపై తనకు ఎంతగా విశ్వాసం ఉందన్న విషయాన్ని పవన్ తన మాటలతోనే చెప్పేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.